సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కి వెళ్తుందన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.
కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఓర్వకల్లు దగ్గర గ్రీన్‌కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్‌కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment