ఓ రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం (ఫైల్)
ఆదిలాబాద్ అర్బన్ : జూలై ఒకటో తారీఖు గడిచిపోయింది. ఫస్టు కాకముందే ప్రతి నెల బియ్యం కంట్రోల్ దుకాణానికి వస్తుండే. కానీ ఈ నెల రేషన్ బియ్యం ఇంకా రాలేదు. రేపెళ్లుండి వసాయేమో.. అని గ్రామాల్లో కొందరు కార్డుదారులు చర్చించుకుంటున్నారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రేషన్ డీలర్లు సమ్మెలో ఉండడం, పంపిణీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం.. వెరసి ఈ నెల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ (మండలస్థాయి నిల్వ గిడ్డంగి)ల నుంచి ఇంకా గ్రామాలకు రేషన్ బియ్యం సరఫరా కాలేదు. డీడీలు కట్టిన డీలర్లకు ఒక్కో లోడ్ లారీ బియ్యం చొప్పున సరఫరా చేస్తున్న అధికారులు, డీడీలు కట్టని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ నెల 29తో డీలర్ల డీడీల సమర్పణ గడువు ముగిసినా.. జూలై 1 ఆదివారం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ గడువు సైతం ముగియడంతో మహిళా సంఘాల ద్వారా డీడీలు తీసి కట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
112 చోట్ల డీలర్లు.. 243 చోట్ల సంఘాలు..
జిల్లాలో ఎప్పుడు జరగని వింత పరిస్థితి చోటు చేసుకుంటోంది. జిల్లాలో 355 చౌక ధరల దుకాణాల పరిధిలో 1,81,922 కార్డుదారులకు నెలకు 4,020 క్వింటాళ్ల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ఈ నెల రేషన్ బియ్యాన్ని 112 చోట్ల డీలర్లు, 243 చోట్లలో మహిళా సంఘాలు గ్రామాలో, విలేజ్ ఆర్గనైజర్లు (వీవో) పట్టణాల్లో పంపిణీ చేయనున్నారు. అయితే డీలర్లు ఇదివరకు పంపిణీ చేసిన స్థలాల్లోనే పంపిణీ చేయనుండగా, సంఘాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ, యూత్ భవనాల్లో పంపిణీ చేయనున్నారు. ఇందుకు అధికారులు సంబంధిత భవనాల వివరాలు సేకరించి బియ్యాన్ని నిల్వ చేసేందుకు అనువుగా ఉన్నాయని గుర్తించారు. బియ్యం పంపిణీకి గుర్తించిన మహిళా సంఘాలతో సోమవారం నుంచి డీడీలు కట్టించి అదే రోజు నుంచి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే డీడీలు సంఘం డబ్బుల ద్వారా పంపిణీ చేయగా వచ్చిన డబ్బును తమకు జమ చేసుకోనున్నారు.
సరిపడా డబ్బు సంఘాల వద్ద అందుబాటులో లేకుంటే క్రెడిట్ ఆర్వో (బియ్యం పంపిణీ చేశాకే డబ్బు చెల్లింపు చేయడం)తో బియ్యం సరఫరా చేయనున్నట్లు అధికారులు ఇది వరకే స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 10 వరకు బియ్యం పంపిణీ చేసి స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైన చోట గడువును పొడిగించనున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరుకులు అందకపోయినా, సరఫరాలో ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1967కు లేదా వాట్సాప్ నంబర్ 7330774444కు సమాచారం ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
సంఘాలతో సాధ్యమేనా..?
రేషన్ బియ్యాన్ని మహిళా ద్వారా పంపిణీ చేయడంపై డీలర్లు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల వద్ద తూకం మిషన్లు లేవు. వాటిపై వారికి అవగాహన లేదు. పక్క జిల్లాలో ఇది వరకే మహిళా సంఘాలకు తూకం మిషన్ల వాడకంపై, రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నా.. మన జిల్లాలో అధికారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ–పాస్ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు డీలర్ల వద్ద ఉన్నాయి. డీలర్లతో మాట్లాడి వారి వద్ద ఉన్న తూకం మిషన్లను మహిళా సంఘాలకు ఇప్పించే బాధ్యతను జిల్లా యంత్రాంగం తహసీల్దార్లకు అప్పగించింది. అయితే పంపిణీ గడువు దగ్గర పడుతున్నా ఇంత వరకు ఏ ఒక్క తహసీల్దార్ ఆ దిశగా అడుగు వేయలేదు. దీంతో మహిళా సంఘాల ద్వారా బియ్యం పంపిణీ సాధ్యమేనన్నా అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా కార్డుదారులకు బియ్యం సరఫరా కావడం ముఖ్యమని పలువురు చర్చించుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment