ఆకట్టుకున్న కళా సౌరభ నృత్యప్రదర్శన
కర్నూలు (కల్చరల్): నటరాజ నృత్య కళామందిర్ ఆధ్వర్యంలో 12వ త్రై మార్షిక కళా సౌరభ కార్యక్రమంలోని నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నటరాజ నృత్య కళామందిర్ నిర్వాహకులు కరీముల్లా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ (వనపర్తి) నిర్వాహకురాలు మీరజాదేవి శిశ్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నత్యాలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అంతకుముందు కడప జిల్లా వాస్తవ్యులు సుగునాకర్ పాడిన అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సంగీత విభావరికి సుధాకర్, రమణయ్య సంగీత సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నటరాజ నృత్య కళా మందిర్ కర్నూలు నగరంలో ఎంతో మంది విద్యార్థులను భారతీయ శాస్త్రీయ నృత్యాలలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి కళాసౌరభం పేరుతో వివిధ ప్రాంతాల కళాకారులను కర్నూలుకు పిలిపించి నృత్య ప్రదర్శనలు ఇప్పించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ఆకాశవాణి వ్యాఖ్యాత డా.వి.పోతన్న, కళాసౌరభం అధ్యక్షులు డా.బీవీ.స్వరూప్సిన్హా తదితరులు పాల్గొన్నారు.