దెబ్బకొట్టినా.. పొగుడుతున్న మెర్సిడెస్ బెంజ్
గౌహతి : లగ్జరీ కార్ల తయారీదారి మెర్సిడెస్ బెంజ్‌కు పెద్ద నోట్ల రద్దు భారీగానే దెబ్బకొట్టినప్పటికీ, ఈ ప్రక్రియను తాము అభినందిస్తున్నామని వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలకు విచ్చేసే కస్టమర్ల సంఖ్యపై ప్రభావం చూపిందని, నవంబర్ నెలలో ఈ సంఖ్య దాదాపు 60 శాతం పడిపోయిందని ఈ కంపెనీ తెలిపింది. అయితే తాము పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను స్వాగతిస్తున్నామని, నగదుకు కార్లను విక్రయించడం తమ పాలసీ కాదని ఆ కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ ఫోల్గర్ చెప్పారు. పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దుచేయడం తమ షోరూంలకు వచ్చే కస్టమర్ల సంఖ్యపై స్వల్పకాలంలోనే ప్రభావం చూపుతుందని, వచ్చే నెల లేదా రెండు నెలలో పరిస్థితి కుదుటపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
కేంద్రప్రభుత్వం పాలసీ నిర్ణయం ప్రజలపై భావోద్వేగ ప్రభావాన్ని చూపిందని, దీంతో వారు కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేశారని చెప్పారు. 99 శాతం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల అమ్మకాలు ఫైనాన్స్ ద్వారానే జరుగుతున్నట్టు పేర్కొన్నారు. డీలర్ లెవల్లో కొంతశాతంలో మాత్రమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. పెద్ద నోట్లను రద్దైన రాత్రి చాలామంది కస్టమర్లు పెద్దపెద్ద నగదు బ్యాగులతో షోరూంలకు వచ్చినట్టు డీలర్స్ ద్వారా తమకు సమాచారం అందిందని, అయితే డీలర్స్ అమ్మకాలు నిర్వహించవద్దని ఆదేశించినట్టు తెలిపారు. దేశ రాజధాని పరిధిలో పెద్ద డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం తమ కంపెనీ అమ్మకాలు ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో పడిపోతాయని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. జర్మన్ ఆటో దిగ్గజం మెర్సిడెస్ బెంజ్‌కు సబ్సిడరీగా భారత్‌లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.