Merimata festivities
-
గుణదల ఉత్సవాలు 9 నుంచి
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప శుక్రవారం ప్రకటించారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముందుగా నిర్వహించే నవదిన ప్రార్థనలు శనివారంతో ముగుస్తాయన్నారు. తొమ్మిదో తేదీ ఆదివారం ఉదయం తొలి సమష్టి దివ్యబలిపూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తిరునాళ్లకు హాజరయ్యే భక్తుల కోసం సకల ఏరాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొండ దిగువన ఉన్న బిషప్‌గ్రాసి పాఠశాల, ఐటీఐ కళాశాల ప్రాంగణాలలో తిరునాళ్లు జరుగుతాయని వివరించారు. ఉత్సవాలలో భాగంగా భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా రూపొందించినట్లు చెప్పారు. యాత్రికులందరూ ఆధ్యాత్మిక చింతనతో మరియమాతను దర్శించుకుని ఆమె దీవెనలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మరియమాతకు అనేక మొక్కుబడులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. తిరునాళ్ల సందర్భంగా కుల, మత భేదాలు లేకుండా అందరూ మరియమ్మను దర్శించుకోవడం ఆలయ ప్రత్యేకతగా తె లిపారు. అనంతరం చాన్సలర్ ఫాదర్ జే జాన్‌రాజు మాట్లాడుతూ ఉత్సవాల నిమిత్తం విద్యుత్ అలంకరణకు సుమారు 450 కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, క్యాథలిక్ అసోసియేషన్ నాయకుడు మద్దాల అంతోని తదితరులు పాల్గొన్నారు. -
మేరీమాత ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఆలయంలో ఫిబ్రవరిలో మేరీమాత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు. గుణదలమాత ఆలయ ఆవరణలోని కమ్యూనిటీ హాలులో గురువారం సాయంత్రం ఉత్సవాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చిన్నప్ప మాట్లాడుతూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పటిష్టమైన ప్రణాళికతో తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కొండ ఎగువ భాగం నుంచి పలు ప్రదేశాల్లో తాత్కాలిక నీటి ట్యాంకులు సిద్ధం చేస్తామని చెప్పారు. భక్తులు క్రమపద్ధతిలో మేరీమాతను దర్శించుకునేందుకు బారికేడ్లు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులతో సంప్రదించి విద్యుత్, వైద్యం, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కథోలిక పీఠం కోశాధికారి ఫాదర్ ఎం.గాబ్రియేల్, ఎస్ఎస్సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, యూత్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ దేవకుమార్, ఫాదర్ కిషోర్ పాల్గొన్నారు.