గుణదల ఉత్సవాలు 9 నుంచి
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఉత్సవాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప శుక్రవారం ప్రకటించారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ముందుగా నిర్వహించే నవదిన ప్రార్థనలు శనివారంతో ముగుస్తాయన్నారు.
తొమ్మిదో తేదీ ఆదివారం ఉదయం తొలి సమష్టి దివ్యబలిపూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తిరునాళ్లకు హాజరయ్యే భక్తుల కోసం సకల ఏరాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొండ దిగువన ఉన్న బిషప్‌గ్రాసి పాఠశాల, ఐటీఐ కళాశాల ప్రాంగణాలలో తిరునాళ్లు జరుగుతాయని వివరించారు. ఉత్సవాలలో భాగంగా భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా రూపొందించినట్లు చెప్పారు. యాత్రికులందరూ ఆధ్యాత్మిక చింతనతో మరియమాతను దర్శించుకుని ఆమె దీవెనలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.
లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మరియమాతకు అనేక మొక్కుబడులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. తిరునాళ్ల సందర్భంగా కుల, మత భేదాలు లేకుండా అందరూ మరియమ్మను దర్శించుకోవడం ఆలయ ప్రత్యేకతగా తె లిపారు. అనంతరం చాన్సలర్ ఫాదర్ జే జాన్‌రాజు మాట్లాడుతూ ఉత్సవాల నిమిత్తం విద్యుత్ అలంకరణకు సుమారు 450 కిలోవాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, క్యాథలిక్ అసోసియేషన్ నాయకుడు మద్దాల అంతోని తదితరులు పాల్గొన్నారు.