పఠనంతోనే వికాసం.. సృజనకు చూపును మార్గం
జీవితానికి అదే దారిదీపం
ప్రజల ఆదరణ, ప్రభుత్వ సహకారం తోడైతే పూర్వవైభవం
‘పుస్తకాలను ప్రేమించండి. అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సఘటనల, భయంకర గందరగోళంలోంచి బయటపడేసేందుకు మీకు అవి స్నేహపూర్వకమైన సలహాలనిస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధస్సును, మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపేస్తాయి’ అన్నారు రష్యాకు చెందిన రచయిత మాక్సీమ్ గోర్కీ. అంతటి ప్రాధాన్యత గల పుస్తకాల పఠనం తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 2 నుంచి 12వతేదీ వరకు విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా..
తెనాలి: ఒకప్పుడు చరిత్ర, సామాజిక పరిజ్ఞానం, కాల్పనిక సాహిత్య రచనలను చదివేవారు. అపరాధ పరిశోధన నవలలు మార్కెట్‌లోకి వస్తే హాట్‌కేకులయ్యేవి. పెద్దలు చదువుతుంటే.. పిల్లలు కూడా వాటిపై దృష్టి పెట్టేవారు. ఊళ్లోని లైబ్రరీకి తరచూ వెళ్లటం, పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని, చదవటం ఒక అలవాటుగా ఉండేది. పాఠశాలలు, కళాశాలల్లో పుస్తకాల లైబ్రరీ అందుబాటులో ఉండేవి. దిన, వార, మాసపత్రికలతో సహా ప్రముఖ రచయితల రచనలన్నీ వాటిలో లభ్యమయేవి. అప్పట్లో వచ్చే వారపత్రికలు, దినపత్రికల్లో సీరియల్స్‌గా వచ్చే నవలల కోసం పాఠకులు ఎదురుచూసేవారు. అన్నీ దాచుకుని, సీరియల్ అయిపోగానే నవలగా బైండింగ్ చేయించుకునేవారు.
తగ్గుతున్న ప్రచురణకర్తలు
పుస్తకానికి గడ్డుకాలం దాపురించడంతో ప్రచురణకర్తలు తగ్గిపోతున్నారు. విజయవాడ కంటే ముందే 1950 కాలంలో తెనాలి ప్రచురణ కేంద్రంగా విరాజిల్లింది. సుప్రసిద్ధ కవులు, రచయితలకు నిలయమైంది. అప్పట్లోనే ఇక్కడినుంచి వార, మాసపత్రికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రచురణ కేంద్రంగా వర్ధిల్లిన విజయవాడలో ఒకప్పుడు 50కు పైగా ప్రచురణకర్తలు ఉండగా ప్రస్తుతం అయిదారుగురే ఉన్నారు. చదువరులు తగ్గిపోవటంతో పుస్తకాలు కొనటం లేదు. ప్రచురణకర్తలు గతంలో ఒక్కో పుస్తకాన్ని కనీసం వెయ్యి ప్రతులు ముద్రించేవారు. ఇప్పుడు ఏ పుస్తకమైనా 200కు మించి మార్కెట్ ఉండటం లేదంటున్నారు.
నీరసించిన గ్రంథాలయాలు
ప్రభుత్వ గ్రంథాలయాలు నీరసించిపోవటం కూడా పుస్తక ప్రాభవం తగ్గటానికి కారణాల్లో ఒకటి. రాష్ట్రంలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నులో రూపాయికి 8 పైసలు స్థానిక సంస్థలకు వెళుతున్నా.. గ్రంథాలయాలకు ప్రభుత్వాలు ఏమీ చేయటంలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు కొనుగోలు చేశారు. పాఠశాలలు, కాలేజీల్లో లైబ్రరీలు తగ్గిపోయాయి. పుస్తకం గత వైభవాన్ని కోల్పోయింది.
జీవనశైలి మారడంతో..
క్రమంగా మారుతూ పుస్తకాల వైపు ప్రజల చూపు తగ్గిపోయింది. పిల్లలకు సామాజిక పరిజ్ఞానం, సాహిత్యంపై అభిలాష, చారిత్రక నేపథ్యంపై ఆసక్తిని కలిగించేలా పెద్దల జీవనశైలి ఉండటం లేదు. చిన్నతనం నుంచి పుస్తకాల్ని చదివించాల్సిన అవసరాన్ని గుర్తించటంలో ఇంటినుంచి బడి వరకు అంతా విఫలమయ్యారు. కార్పొరేట్ స్కూళ్ల రాకతో ర్యాంకుల వైకుంఠపాళీలో పిల్లలకు స్కూల్ క్లాసులతోనే పొద్దుపోతోంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంజినీరింగే. జనరల్ నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ కోసం కూడా చాలామంది దినపత్రికలు చూడటం లేదంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్ తల్లి’నే అన్నీ అడుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ కొలువులు పుస్తకానికి తీసుకొచ్చిన తంటా ఇది.
పుస్తక ప్రచురణ కష్టసాధ్యంగా ఉంది
పుస్తకాలు వెయ్యి కాపీలు వేసే ప్రొఫెషనల్ పబ్లిషింగ్ ఇప్పుడు లేదు. యూనికోడ్ వచ్చాక ఎవరికివారు యూనికోడ్‌లో రాసుకుని తక్కువ కాపీలను డిజిటల్ ప్రింటింగ్ చేయిస్తున్నారు. పుస్తకాలను కొనకపోవటంతో వచ్చిన పరిస్థితి ఇది. సామాజిక శా్రస్తాలు, రాజకీయ నేపథ్యం ఉన్న పుస్తకాలను అధ్యయనం కోసం కొంటున్నారు. చదివినా చదవకున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు పోతున్నాయి. దళిత సాహిత్యం బాగానే అమ్ముడవుతోంది. – వెంకట నారాయణ, పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ
ప్రభుత్వ సహకారం ఉంటేనే మనుగడ
ప్రభుత్వ సహకారం ఉంటేనే పుస్తకానికి మనుగడ ఉంటుంది. లైబ్రరీల ద్వారా పుస్తకాలు కొనుగోలు చేయించాలి. ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయాలి.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్రైబరీలను ఏర్పాటు చేయాలి. వాటికీ పుస్తకాలు సరఫరా చేయాలి. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన పుస్తకాలకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. – బి.రవికుమార్, నవరత్న బుక్‌హౌస్, విజయవాడ
నవతరం దారి మళ్లింది
నవతరం పుస్తక పఠనం నుంచి దారి మళ్లింది. సంపాదనే ముఖ్యమైంది. మానవీయ విలువలపై అవగాహన లేకుండాపోయింది. తెలుగు భాష, సంస్కృతులపై చిన్నచూపు ఏర్పడింది. వ్యక్తిగత స్వార్థం పెరిగి, సాహిత్య పఠనం లేక జరుగుతున్న అనర్థాలివి. గ్రంథాలయాలను ఆధునికీకరించి, పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచేలా చేసినపుడే పుస్తకానికి మంచి రోజులొస్తాయి. – వల్లూరు శివప్రసాద్, కన్వీనర్, గ్రంథాలయాల పునర్వికాసం ఉద్యమ వేదిక
Comments
Please login to add a commentAdd a comment