మన ఓటర్ల జాబితా ప్రపంచానికే ఆదర్శం
ఏలూరు, న్యూస్‌లైన్ : ఓటర్ల జాబితా రూపకల్పనలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, జిల్లా ఓటర్ల నమోదు పరిశీలకులు శశిభూషణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఎన్నికల సిబ్బందితో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్‌లోని దేశాలకు మిన్నగా మనదేశంలోనే పటిష్టమైన రీతిలో ఓటర్ల జాబితా రూపకల్పన జరిగిందన్నారు.
పూర్తిస్థాయిలో పారదర్శకంగా అర్హత గల వారందరికీ ఓటు హక్కు కల్పించామన్నారు. తప్పొప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ఈఆర్వో, బీఎల్వోల పాత్ర కీలకమైందన్నా రు. జిల్లాలో అర్హత కలిగిన లక్షా 80 వేలమంది ఓటర్లుగా నమోదు కావాల్సి ఉన్నట్లు గుర్తించామని, అందువల్లే ప్రత్యేక నమోదు కార్యక్రమాలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులను గుర్తించి వారిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. కలెక్టర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నకిలీ ఓటర్లను తొలగించడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో 40,963 మంది కొత్తగా దరఖాస్తు చేశారని వివరించారు. జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె. ప్రభాకరరావు ఓటర్ల నమోదు ప్రక్రియ, ఇతర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఓటర్ల నమోదుపై మంచి స్పందన
యువతలో ఓటర్ల నమోదుపై మంచి స్పందన లభించిందని భవిష్యత్తులో మరింత సులభతరంగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టడానికి ఎంతో దోహదపడుతుందని శశిభూషణ్‌కుమార్ చెప్పారు. ఏలూరులోని సీఆర్ఆర్ మహిళా కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాలలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై ఆయన విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. దేశ భవిష్యత్‌ను నిర్దేశించే శక్తి యువతరానికి ఉంటుందని, అటువంటి యువత ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు పొందిన యువత తమ పేర్లు ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నాయో పరిశీలించుకుని ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులు ఉచితంగా పొందవచ్చన్నారు.
కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ ప్రతీ కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించడానికి ఆయా కళాశాలలో అంబాసిడర్లను నియమించామని వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ షౌర్లీ మాట్లాడుతూ కళాశాలలో 431 మంది విద్యార్థులు ఓటు హక్కుపొందేందుకు దరఖాస్తులు సమర్పించారని వివరించారు. సమావేశంలో జేసీ టి. బాబూరావునాయుడు, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
యువ ఓటర్ల నమోదు శాతం పెరగాలి
దువ్వ (తణుకు రూరల్) : 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారి ఓటర్ల నమోదు స్వల్పంగానే ఉందని శశిభూషణ్ కుమార్ చెప్పారు. దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి బీఎల్వోలతో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలో రూ.1.28 లక్షల మంది 18 నుంచి 19 వయసున్నవారుండగా వారిలో 33 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, యువత తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని సూచించారు. రెండుసార్లు ఓటరుగా నమోదైన వివరాలను ఎలా తొలగిస్తారో అని బీఎల్వోలను అడిగి ఆ విధానాన్ని పరిశీలించారు. ఓటు తొలగింపు ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేయాలని స్థానిక తహసిల్దార్ ఎం.హరిహరబ్రహ్మాజీకి సూచించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.