భారత్‌లో గోల్డ్ మైనింగ్ బంగారమవుతుంది.. కానీ!
న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తున్నప్పటికీ ఈ మెటల్ ఉత్పత్తిలో వెనుకబడి ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత్ బంగారం గనుల ఉత్పత్తి 2020లో 1.6 టన్నులని వెల్లడించింది. అయితే దీర్ఘకాలంలో దేశీయ ఉత్పత్తి వార్షికంగా 20 టన్నులకు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇందుకు పలు చర్యలు అవసరమని సూచించింది. భారత్‌లో బంగారం మార్కెట్‌పై జరుపుతున్న అధ్యయనంలో భాగంగా ‘గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా’ అన్న శీర్షికన మండలి ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
► భారతదేశానికి బంగారం తవ్వకాలలో గొప్ప వారసత్వం ఉంది. అయితే తక్కువ పెట్టుబడుల కారణంగా దేశీయంగా పరిశ్రమ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. భారత్ పసిడి మైనింగ్ మార్కెట్ ఒక చిన్న స్థాయిలో పనిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారీ పెట్టుబడులతో ప్రవేశించడం అంత సులభం కాదు.
► భారతదేశం ప్రస్తుత వనరులు, ఇతర దేశాలలో ఉత్పత్తి– వనరుల స్థాయిలతో పోల్చితే దీర్ఘకాలంలో సంవత్సరానికి దాదాపు 20 టన్నుల వార్షిక ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయి.
► నియంత్రణ సవాళ్లు, పన్నుల విధానాలు, మౌలిక సదుపాయాలు దేశంలో పసిడి మైనింగ్‌కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి.
► బంగారు తవ్వకం భారతదేశానికి గణనీయమైన స్థిరమైన సామాజిక–ఆర్థిక అభివృద్ధిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం బంగారం కోసం అన్వేషణ, మైనింగ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడే అంశంగా చెప్పడంలేదు. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తికి శిక్షణ ఇచ్చే వారసత్వం సంపద భారత్ సొంతం.
► మైనింగ్ విస్తృతి... ఒక ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పన, సంబంధిత పెట్టుబడిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అనుబంధ సేవా పరిశ్రమలు ప్రారంభమవుతాయి. ఇలా ఏర్పాటయ్యే పరిశ్రమలు సంబంధిత గని కార్యకలాపాల కాలపరిమితికి మించి ఎక్కువ కాలం కొనసాగుతాయి.
► భారతదేశం తన బంగారు మైనింగ్ ఆస్తులను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తుందనే బలమైన విశ్వాస్వాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయి. ఇదే జరిగితే దేశం బంగారు మైనింగ్ రంగానికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
► ప్రస్తుతం మైనింగ్ రంగం మూడు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. మైనింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంది. ఇందులో బహుళ ఏజెన్సీల పాత్ర ఉంటోంది. ఒక్క లైసెన్స్ కోసం 10 నుంచి 15 ఆమోదాలు పొందాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనికితోడు ఆయా ఆమోదాల కోసం తీవ్ర జాప్యం పెట్టుబడులకు ప్రధాన అవరోధంగా తయారయ్యింది. ప్రధానంగా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే బహుళజాతి కంపెనీలు దేశంలో పెట్టుబడులకు దూరంగా ఉంటాయి. ఇక మూడవ సమస్య విషయానికి వస్తే, మైనింగ్ పరికరాలపై దిగుమతి పన్ను, ఇతర ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి.
► ప్రత్యామ్నాయాలు లేని పరిస్థితుల్లో మైనింగ్ పరికరాలను దిగుమతి చేసుకోడానికి ప్రాజెక్ట్ డెవలపర్లు మొగ్గు చూపుతారు. అధిక దిగుమతి పన్నులు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. ఈ రంగంలో అభివృద్ధిని నిరోధిస్తాయి.
► అనేక కీలకమైన బంగారు మైనింగ్ ప్రాంతాలు మౌలిక సదుపాయాలు పేలవంగా ఉన్న రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉండడం మరో ప్రతికూల అంశం. ప్రత్యేకించి రహదారి, రైలు లింక్‌లు అంతంతమాత్రంగా ఉన్న ప్రాంతాలకు మైనింగ్ పరికరాలు, సంబంధిత సామాగ్రి తరలించడం కష్టతరం, వ్యయ భరితం అవుతుంది. ఫలితంగా, గత 15 సంవత్సరాలుగా బంగారం అన్వేషణలో పరిమిత పెట్టుబడుల పరిస్థితిని దేశం ఎదుర్కొంటోంది.
► అయితే, ఇటీవలి సంవత్సరాలలో భారత ప్రభుత్వం అత్యంత సమస్యాత్మకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భారతదేశ బంగారు గనుల రంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. పలు విధాన మార్పులను ప్రతిపాదించి అమలు చేస్తోంది.
► గనులు– ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957 (ఎంఎండీఆర్) సవరణకు 2015 మార్చిలో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. వేలం ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజుల కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావడానికి ఇది దోహదపడింది. ప్రధాన మైనింగ్ లీజుల వ్యవధిని 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పొడిగించింది.
► మైనింగ్ అన్వేషణను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా 2016 జూన్‌లో ప్రభుత్వం జాతీయ ఖనిజ అన్వేషణా విధానం (ఎన్‌ఎంఈపీ)న్ని ఆమోదించింది. మైనింగ్ రంగంలో అడ్డంకులను తొలగించి, అభివృద్దిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని (ఎన్ఎంపీ 2019) అమలు చేస్తున్నట్లు 2019 మార్చిలో ప్రకటించింది. ఈ విధానం బొగ్గు, ఇతర ఇంధనేతర ఖనిజాలకు వర్తిస్తుందని తెలిపింది. తద్వారా ఏడేళ్ల కాలంలో భారత్ ఖనిజ ఉత్పత్తి విలువలను 200 శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అంశం ఇది.
సానుకూల మార్పులు
ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి, మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం సమంజసమే. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణా పరమైన అడ్డంకులు తొలగాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనులు, ఖనిజాల (అభివృద్ధి–నియంత్రణ) చట్టంలో మార్పులు, జాతీయ మినరల్ పాలసీ, జాతీయ ఖనిజాల అన్వేషణ విధానం ఆవిష్కరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఇదే ధోరణి కొనసాగితే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ బంగారం గని ఉత్పత్తి పెరుగుతుందని అంచనా. అయితే కొత్త విధానాల అమలు, వాటి విజయవంతం, నూతన పెట్టుబడులు రాక వంటి అంశాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి.
– సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ (ఇండియా) రీజినల్ సీఈఓ