తీన్మార్
⇒ మెతుకుసీమలో మూడు జిల్లా కేంద్రాలు పక్కా..!
⇒ ఘనపురం ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు
⇒ పంచాయతీకి రూ.15 లక్షలు, మండల కేంద్రానికి రూ.25లక్షలు
⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు
⇒ ఆనందోత్సాహాల్లో జిల్లా వాసులు
మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మెతుకుసీమను విభజించి మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు హెలీకాఫ్టర్ ద్వారాఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మెదక్‌లో జరిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ ప్రాంత ప్రజలు కోరిక మేరకు త్వరలోనే మెదక్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలను 13 నియోజకవర్గాలుగా విభజించి మెతుకుసీమను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలు కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే ఈ ప్రాంత నాయకులంతా మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపాలన్నారు.
గుంట భూమి మునగనివ్వం
శతాధిక వయస్సు గల ఘనపురం ప్రాజెక్ట్ అద్భుతమైన కట్టడమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆంధ్ర పాలకుల హయాంలో పూడికకు గురైనప్పటికీ వారు పట్టించుకోక పోవడం వల్ల ఆయకట్టు రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలుగలేదన్నారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు, కాల్వల ఆధునీకరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామని, రెండు రోజుల్లో జీఓకూడా విడుదల చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ వరకు పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఏరియల్ సర్వే ద్వారా కాల్వలోని ప్రతి ఇంచు జాగను పరిశీలించామన్నారు. గుంట భూమి మునగకుండా ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతామన్నారు. మంజీరానదిపై 7 చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పంచాయతీకి రూ.15 లక్షలు
నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.15 లక్షలు, మండల కేంద్రానికిరూ.25 లక్షలు, మెదక్ పట్టణానికి రూ.కోటి తమ ప్రత్యేక నిధుల ద్వారా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆయా అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలకే అప్పజెప్పాలన్నారు. మెదక్ పట్టణంలో షాదిఖానాకోసం రూ.కోటి నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే పట్టణంలో డబుల్ డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్లను ఆధునీకరిస్తామని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. తన బిడ్డలాంటి డిప్యూటీ స్పీకర్ పద్మ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, మరోసారి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో సమావేశం నిర్వహించి అభివృద్ధి చర్యలు చేపడుతానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని, లేకుంటే ఓట్లు అడగబోమని స్పష్టంచేశారు.
ఈ బాధ్యతను స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 40వేల మొక్కలు నాటాలన్నారు. తద్వారా కరువును పారదోలవచ్చన్నారు. చిన్నశంకరంపేట మండలంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒక్కరోజులోనే కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింత ప్రభాకర్ , గూడెం మహిపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రేమండ్ పీటర్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ శరత్, ఆర్డీఓ మెంచు నగేష్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, నరేంద్రనాథ్, ఐఏఎస్ అధికారులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.