పన్నుకు పన్ను ట్రంప్ ప్రతిపాదనలపై మెక్సికో!
మెక్సికో: మెక్సికో నుంచి దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తామన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికకు ఆ దేశం తీవ్రంగా స్పందించింది. అదే జరిగితే మెక్సికో కూడా సుంకాలతో బదులిస్తుందని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దుల వెంబడి మాదకద్రవ్యాలు, వలసదారుల ప్రవాహాన్ని ఆపకపోతే మెక్సికో వస్తువులపై 25% దిగుమతి సుంకాలు తప్పవని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను క్లాడియా తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరికా నుంచి అక్రమంగా ప్రవాహంలా వచ్చిపడుతున్న ఆయుధాలతో మెక్సికో బాధపడుతోందన్నారు. ఇక మాదకద్రవ్యాలు అమెరికా సొంత సమస్యేనన్నారు. వలస సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. సమస్యలపై చర్చలకు సిద్ధమన్నారు. వలసదారుల కారవాన్లు ఇకపై సరిహద్దుకు చేరవని స్పష్టం చేశారు. ఆయుధాలపై పెట్టే ఖర్చును వలస సమస్యను పరిష్కారానికి వెచ్చిస్తే మంచిదని అమెరికాకు హితవు పలికారు. యుద్ధానికి ఖర్చు చేసే మొత్తంలో కొంత శాంతి, అభివృద్ధిపై కేటాయిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అమెరికా, మెక్సికో పలు అంశాల్లో పరస్పరం ఆధారపడతాయి. భారీ పన్నులు ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణానికి, నిరుద్యోగానికి కారణమవుతాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, శాంతి సాధనకు చర్చలే మార్గం’’అన్నారు. అవి త్వరలోనే జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.