చక్కని లాభాల పంట చియా!
ఏదైనా కొత్త పంట గురించి విన్నప్పుడు సహజంగానే రైతుల మదిలో అనేక సందేహాలు చెలరేగుతాయి. ఆ సందేహాలన్నిటికీ సరైన సమాధానాలు లభిస్తే.. అది మనకు తెలియని విదేశీ పంట అయినా రైతుల మనసు గెలవ గలుగుతుంది. కర్ణాటకలో రైతులు గత ఏడాది నుంచి సాగు చేస్తూ లబ్ధిపొందుతున్న అటువంటి ఒకానొక పంట ‘చియా’. రైతులు వ్యక్తులుగా కాకుండా వ్యవసాయోత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడినప్పుడే కొత్త పంటలనైనా, సరికొత్త మార్కెటింగ్ అవకాశాలనైనా అందిపుచ్చుకోవడం సాధ్యమని కర్ణాటక రైతులు రుజువు చేస్తున్నారు. చియా మొక్క తులసి మొక్కను పోలి ఉంటుంది. చియా గింజలు చిన్న సజ్జ గింజల మాదిరిగా ఉంటాయి.
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో దేశ విదేశీ మార్కెట్లలో చియా గింజలకు మంచి గిరాకీ ఉందని, రైతులు సంఘటితమై వీటిని సాగు చేసి చక్కని పోషకాహారాన్ని రుచి చూడటమే కాకుండా విదేశాలకూ ఎగుమతి చేసి అధికాదాయాన్ని పొందవచ్చని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సి.ఎఫ్.టి.ఆర్.ఐ.) చెబుతోంది. ఈ సంస్థ తోడ్పాటుతో కర్ణాటక రైతులు ఎకరానికి రూ. 35 వేల నుంచి 40 వేల వరకు నికరాదాయం గడిస్తున్నారు.
స్ఫూర్తిదాయకమైన ఆ విజయగాథను తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అందించడంతోపాటు.. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ద్వారా చియా గింజలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ‘సాక్షి’ సాగుబడి డెస్క్ చేసిన కృషి ఫలించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే.. చియా ఆకులు ఘాటైన వాసన వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి అడవి జంతువుల బెడద ఈ పంటకు ఉండదు. ఇతర పంటలు సాగు చేసే పొలాల చుట్టూతా రక్షక పంటగా కొన్ని సాళ్లలో చియాను సాగు చేసుకోవచ్చు.
≈ మెక్సికో పంటను మన రైతులకు పరిచయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ సి.ఎఫ్.టి.ఆర్.ఐ.
≈ గత ఏడాది కర్ణాటకలో సాగు చేసి అధిక లాభాలు ఆర్జించిన రైతుమిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం సభ్యులు
≈ ఎకరానికి సాగు ఖర్చు రూ. 18 వేలు.. నికరాదాయం రూ. 35 వేల నుంచి 40 వేలు
≈ ‘సాక్షి’ సాగుబడి డెస్క్ కృషితో తెలుగు రాష్ట్రాల రైతులకూ అందుబాటులోకి చియా విత్తనాలు
≈ ఒక్కొక్కరికి 50 గ్రాముల చొప్పున చియా విత్తనాల ఉచిత పంపిణీకి హైదరాబాద్ సి.ఎఫ్.టి.ఆర్.ఐ.లో ఏర్పాట్లు
≈ చియా విత్తనాలను వచ్చే నెల వరకు విత్తుకోవచ్చంటున్న సి.ఎఫ్.టి.ఆర్.ఐ. శాస్త్రవేత్తలు
≈ చియా పంటకు అడవి జంతువుల బెడద ఉండదు
సాగు ఖర్చు ఏటేటా పెరుగుతున్నదే గాని, రైతుల నికరాయం మాత్రం తగినంతగా పెరగడం లేదు. వాతావరణ మార్పులతో వర్షాల తీరుతెన్నులు అనిశ్చితంగా మారడం వంటి కారణాలతో మెట్ట రైతులు అంతకంతకూ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతులు కష్టనష్టాలను అధిగమించాలంటే సంఘటితమై, సాధారణ పంటల కన్నా సరికొత్త పంటల వైపు దృష్టి సారించడం అవసరం. దక్షిణ కర్ణాటక జిల్లాలకు చెందిన రైతులు ఈ సూక్ష్మాన్ని గ్రహించి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సి.ఎఫ్.టి.ఆర్.ఐ.) అందించిన తోడ్పాటుతో.. గత ఏడాది ‘చియా’ అనే కొత్త విదేశీ పంటను సాగు చేసి, అద్భుత ఫలితాలు సాధించారు.
చియా.. ఇది అత్యధిక పోషక విలువలు కలిగిన పంట (సూపర్ ఫుడ్ క్రాప్) అయినందున దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. చియా మెక్సికోకు చెందిన పంట. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధ సంస్థ అయిన సి.ఎఫ్.టి.ఆర్.ఐ. దేశీయంగా అధికోత్పత్తినిచ్చే రెండు చియా వంగడాలను రూపొందించి, రైతులకు అందిస్తోంది. తెల్ల చియా గింజల సాగుకు శ్రీకారం చుట్టిన కర్ణాటక రైతులు ‘రైతు మిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం’ను 1,200 మంది సభ్యులతో 2015 మార్చిలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో సభ్యులైన 100 మంది రైతులు గత రబీలో తలా ఒక ఎకరంలో చియాను సాగు చేశారు. పండించిన చియా గింజలను శుద్ధి చేసి.. దేశ విదేశాల్లోని ఆహార శుద్ధి సంస్థలకు నేరుగా విక్రయిస్తుండటం విశేషం.
రైతు మిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం ఈ ఏడాది 500 మంది రైతులతో చియా గింజలు సాగు చేయించాలని భావిస్తోంది. ఆహార శుద్ధి పరిశ్రమలతో సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ద్వారా మార్కెటింగ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల తెల్ల చియా గింజల అమ్మకాలకు భరోసా ఏర్పడిందని రైతు మిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కురుబుర్ శాంతకుమార్ ‘సాగుబడి’ ప్రతినిధికి టెలిఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు. రైతు మిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం విజయగాథను తెలుసుకున్న సాక్షి ‘సాగుబడి డెస్క్’ మైసూరులోని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. డెరైక్టర్ ప్రొ. రామ్ రాజశేఖరన్‌ను సంప్రదించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులకు కూడా అధికాదాయాన్నిచ్చే చియా పంటను పరిచయం చేయమని విజ్ఞప్తి చేయగా.. ప్రొ. రామ్ రాజశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేయడం సంతోషదాయకం. అంతేకాదు.. హైదరాబాద్‌లోని తమ కార్యాలయం ద్వారా రైతులకు చియా విత్తనాలను తలా ఒక 50 గ్రాములు (అరెకరానికి సరిపోతాయి) అందించడానికి, సాగు పద్ధతులను తెలియజేయడానికి కూడా ఆయన ఏర్పాట్లు చేశారు. అందుకు తెలుగు రాష్ట్రాల రైతుల తరఫున ‘సాక్షి ’ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అధికోత్పత్తినిచ్చే చియా తెల్ల వంగడాలను తాము రూపొందించి, వాటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తుల్లో వినియోగించే సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ప్రొ. రామ్ రాజశేఖరన్ తెలిపారు. చియా వంటి అధిక పోషక, ఔషధ విలువలు కలిగిన పంటల సాగు, శుద్ధి చేసే పద్ధతుల అభివృద్ధిపై సి.ఎఫ్.టి.ఆర్.ఐ. దృష్టి కేంద్రీకరిస్తున్నది.
చియా గింజలను సి.ఎఫ్.టి.ఆర్.ఐ. కొనుగోలు చేయదని.. అయితే, దేశ విదేశాల్లో ఈ గింజలకు మంచి గిరాకీ ఉన్నందున రైతులు సంఘాలుగా ఏర్పడి మార్కెట్లు చేసుకుంటే సమస్య ఉండబోదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. డెరైక్టర్ తెలిపారు. చియా గింజల కోసం తమ సంస్థను సంప్రదించే వాణిజ్య సంస్థలతో వ్యవసాయోత్పత్తిదారుల సంఘాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుతున్నామన్నారు. తద్వారా రైతులకు అధికాదాయం అందించడానికి, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించడానికి కృషి చేస్తున్నామని ప్రొ. రామ్ రాజశేఖరన్ వివరించారు.
చియా సాగు కాలం ఇదే..
చియా చలికాలపు పంట. 100-110 రోజుల పంట. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు చియాను విత్తుకోవచ్చు. గింజలను ఎత్తయిన మడిలో నారు పోసి.. 21 రోజులకు నారు పీకి పొలంలో నాటుకోవాలి. రబీలోనూ ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 3.5 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తెలుగు వారైన సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ప్రధాన శాస్త్రవేత్త (మైసూర్) డాక్టర్ ఎల్. ప్రసన్నాంజనేయ రెడ్డి (092900 34321) తెలిపారు. క్వింటాలుకు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు ధర పలుకుతుంది. రైతులు సంఘంగా ఏర్పడి ముందస్తు అవగాహన ఒప్పందాల మేరకు మార్కెటింగ్ చేసుకుంటే నికరాదాయం ఎకరానికి రూ. 35 నుంచి 40 వేల వరకు వస్తుందన్నారు. నీరు నిలవని భూములు అనుకూలం. కొబ్బరిలో అంతరపంటగా వేసుకోవచ్చన్నారు.
చియా విత్తనాలు పొందడం ఎలా?
ఒక్కో రైతుకు అరెకరానికి (నాట్ల పద్ధతిలో) సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తారు. రైతులు హైదరాబాద్ హబ్సిగూడలోని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. కార్యాలయానికి వెళ్లి చియా విత్తనాలను స్వయంగా పొందవలసి ఉంటుంది. అంతకుముందు అధికారులను ఫోన్లో/ ఈమెయిల్ ద్వారా సంప్రదించి రైతులు తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది:
రుద్రయ్య, సి.ఎస్.ఐ.ఆర్. - సి.ఎఫ్.టి.ఆర్.ఐ. రిసోర్స్ సెంటర్, ఉప్పల్ రోడ్డు, హబ్సిగూడ, హైదరాబాద్-500007.
ఫోన్: 040 - 27151157 email: rchyderabad@cftri.res.in.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఎకరాకు వంద గ్రాములు చాలు!
అంతర్జాతీయంగా తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణపొందిన పంటగా చియాను చెప్పుకోవచ్చు. ఇది మెక్సికో, దక్షిణ అమెరికా మూలాలు కలిగిన పంట. పలు రకాల పోషక విలువలు అధిక పరిమాణంలో ఉండటంతో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. దేశీయంగాను, అంతర్జాతీయ మార్కెట్లోను చియా పంట ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. రైతులు మంచి లాభాలు కళ్లజూడటంతో చియా సాగు ఏటికేడు పెరుగుతోంది. చియా గింజల్లో సుమారు 30-35 శాతం వరకు నూనె శాతం ఉంటుంది. ఈ నూనెలో గుండెకు మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ 60 శాతం వరకు ఉంటాయి.
20-22 శాతం మాంసకృత్తులు, 40 శాతం పీచు పదార్థాలు, పలు రకాల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) శాస్త్రవేత్తలు డా. మాలతీ శ్రీనివాసన్, డా. ఆర్. వి. శ్రీధర్ అధిక దిగుబడినిచ్చే చియాంపియన్ డబ్ల్యూ-83, చియాంపియన్ బీ-1 అనే రెండు తెల్లని చియా వంగడాలను అభివృద్ధి చేశారు. న ల్లమచ్చలు ఉన్న చియా గింజలతో పోల్చితే తెల్ల గింజలకు అధిక డిమాండ్ ఉంది.
పొలం తయారీ.. నారు నాటుకోవటం...
ఖరీఫ్ పంటగా, అక్టోబర్- నవంబర్ నెలల్లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. కనీసం అర అడుగు ఎత్తు ఉండేలా నారుమడులను తయారు చేసుకోవాలి. ఎకరాకు సరిపడా నారుకు వంద గ్రాముల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలకు సమాన పరిమాణంలో మెత్తని ఇసుకను కలిపి మడిపై సమానంగా చల్లుకొని పైన వర్మికంపోస్టుతో కప్పాలి. వాటర్ క్యాన్లతో మడులపై నీరు చల్లాలి. మడుల్లో తగిన తేమ ఉండేలా చూడాలి. మూడు- నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి. 21 రోజులకు నారు నాటుకోవటానికి సిద్ధమవుతుంది. పొలాన్ని బాగా దున్నాలి.
ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, వంద కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 16 కిలోల పొటాష్లను కలిపి చల్లుకోవాలి. ఖరీఫ్‌లో సాళ్ల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. దూరం పాటించాలి. రబీలో సాళ్ల మధ్య 45, మొక్కల మధ్య 30 సెం. మీ. ఎడం ఉండాలి. నారు నాటుకోగానే నీటి తడి ఇవ్వాలి. ఎకరాకు 50 కిలోల యూరియాను వేయాలి. నేలలో తేమను బట్టి వారం, పది రోజులకోసారి తడులివ్వాలి. చియా పంటను చీడపీడలు తెగుళ్లు ఆశించిన దాఖలాలు ఇంతవరకు లేవు. పొలంలో ఏవైనా చీడపీడలను గమనిస్తే.. లీటరు నీటికి 2 ఎం.ఎల్. వేపనూనెను కలపాలి.
వేప నూనె కలిపిన 100 లీటర్ల నీటికి 5 ఎం.ఎల్. సబ్బు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. ఉధృతిని బట్టి రెండు మూడుసార్లు కలుపును నిర్మూలించాలి. మొక్కలు నాటిన 40-55 రోజుల మధ్య పూత వస్తుంది. అప్పటి నుంచి 25-30 రోజులకు గింజలు పక్వానికి వస్తాయి. అప్పటికి మొక్కలు పసుపు రంగులోకి మారతాయి. మొక్కలను కోసి, నూర్చిన గింజలను శుభ్రం చేసి, ఎండబెట్టి, నిల్వ చేసుకోవాలి. చియా గింజల దిగుబడి ఎకరాకు మూడున్నర నుంచి 4 క్వింటాళ్ల వరకు వస్తుంది.
సి.ఎఫ్.టి.ఆర్.ఐ. స్వల్ప మొత్తంలో రసాయనిక ఎరువులు వాడమని చెబుతోంది. అయితే, కొందరు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనూ చియాను సాగు చేస్తున్నారు.
అద్భుత ఆహార పంటలతో మేలు
రైతు పండించే ఆహారంపైనే ప్రపంచవ్యాప్తంగా వస్తు వాణిజ్యం ఆధారపడి ఉంది. అటువంటి రైతుకు పూట గడవని పరిస్థితి నెలకొంది. చియా వంటి నాణ్యమైన అద్భుత ఆహార పంటలను పండించడంలో రైతులకు తోడ్పడేందుకు కృషి చేస్తున్నాం. తద్వారా జాతీయోత్పత్తి పెరుగుతుంది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మరో విషయం ఏమిటంటే.. ఈ సూపర్ ఫుడ్స్ పండించే రైతు కుటుంబాలన్నీ ఆ పంటలను తొలుత ఆహారంలో ఉపయోగించడం కూడా ముఖ్యం. వారి ఆరోగ్యమే దేశ సౌభాగ్యం!
- ప్రొ. రామ్ రాజశేఖరన్, డెరైక్టర్, సి.ఎఫ్.టి.ఆర్.ఐ., మైసూర్
director@cftri.res.in.
చియాతో పెరిగిన రైతుల ఆదాయం
గత ఏడాది వంద మంది రైతులతో తలా ఒక ఎకరంలో చియా సాగు చేయించాం. ఎకరానికి 3.5 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. తోడ్పాటుతో రూ. 3 లక్షల ఖరీదైన చియా గింజల శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 5 టన్నుల చియా తెల్ల గింజలను సింగపూర్, మలేషియా, అమెరికాలకు ఎగుమతి చేశాం. స్థానికంగా 2, 3 కంపెనీలతో ముందే అవగాహన కుదుర్చుకొని తొలి ఏడాది 10 టన్నులు అమ్మాం. ఈ ఏడాది 25-30 టన్నుల ఎగుమతి లక్ష్యంతో 500 మంది రైతులతో తలా ఒక ఎకరం సాగు చేయిస్తున్నాం.
- కుర్బుర్ శాంతకుమార్, చైర్మన్, రైతుమిత్ర వ్యవసాయోత్పత్తిదారుల సంఘం, మైసూర్, కర్ణాటక
raithamitra2014@gmail.com