ఇంతకీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ?
మియాపూర్ భూ కుంభకోణం కేసు విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం రూ. 10వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం అక్రమాలకు సూత్రధారి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు. భూకుంభకోణం మొత్తం ఇతడి కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య ఇంద్రాణి, కోడలు మహిత, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. కుంభకోణం వెలుగులోకి రాగానే అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అతడి భార్య ఇంద్రాణి, కోడలు మహితలపై కూడా కేసులు నమోదయ్యాయి. ట్రినిటీ, సువిశాల సంస్థలలో డైరెక్టర్లంతా ప్రసాద్ కుటుంబ సభ్యులేనని తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ ప్రధాన కార్యాయలంలోనే ఈ రెండు సంస్థలు ఉన్నాయి. మెట్రో సంస్థ చెల్లించే పరిహారం కోసమే గోల్డ్‌స్టోన్ భూములను రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది. అమీరున్నీసా బేగంకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చి భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్లకు రూ. 50 కోట్ల వరకు లంచం ఇచ్చి 693 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రధాన నగరాల్లో ప్రసాద్ కోసం గాలింపు జరుగుతోంది.
మరో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు
ఇక ఇదే కేసులో బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మొత్తం ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భూమాఫియాకు వీరు ముగ్గురు సహకరించారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల మీద పోలీసులు దాడులు చేశారు. అప్లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది.
కిలో బంగారం స్వాధీనం
సబ్ రిజిస్ట్రార్ రవిచంద్రారెడ్డి ఇంటి మీద ఏసీబీ దాడులు చేసింది. ఈ సందర్భంగా కిలో బంగారం, రూ. 2 లక్షల నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన మియాపూర్ భూకుంభోకణంలో అరెస్టయ్యారు.