ఎక్స్పీ కథ కంచికి...ఐతే నాకేంటి?
మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీకి గుడ్‌బై చెప్పేసింది. 8 ఏప్రిల్ 2014 నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్డేట్స్ని నిలిపివేసింది. హ్యాకర్ చొరబడినా... వైరస్ దాడి చేసినా విలువైన సమాచారం కోల్పోవాల్సిందే. అంతేనా? ఇంకేమీ చేయలేమా? డేటాను కాపాడుకోవడం ఎలా? అన్న సందేహాలకు సమాధానాలు ఇవిగో....
ప్రపంచంలోని ప్రతి మూడు కంప్యూటర్లలో ఒకటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్‌పీని వాడుతూందంటేనే దీని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. విండోస్ 98 తరువాత అత్యంత ప్రజాదరణ పొందని ఓఎస్ ఇది. విస్టా, విండోస్ 7, 8 వెర్షన్లు వచ్చినా అనుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది దీనికే కట్టుబడి ఉండిపోయారు. అయితే మైక్రోసాఫ్ట్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఈ ఓఎస్‌కు అందించే సపోర్ట్ సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటిండంతో చాలామందిలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ముందు ఉన్న అవకాశాలు ఇలా ఉన్నాయి...
కొత్త ఓఎస్‌లకు వెళ్లడం...
విండోస్ ఎక్స్పీ స్థానంలో నేరుగా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎంచుకోవచ్చు. అయితే దీనికి మీరు ఉపయోగిస్తున్న పీసీలోని హార్డ్‌వేర్ సపోర్ట్ చేస్తుందా లేదా? చూసుకోవాల్సి ఉంటుంది. ఒక గిగాహెర్ట్జ్ కంటే ఎక్కువ వేగమున్న ప్రాసెసర్, ఒక జీబీ ర్యామ్, (64 బిట్ కంప్యూటర్లకైతే 2 జీబీ), 16 నుంచి 20 జీబీల హార్డ్‌డిస్క్ ఉంటే చాలు... ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న పీసీలోనే విండోస్ 7 లేదా 8ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే పీసీ పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. ఈ సరికొత్త ఓఎస్‌లు వేగంగా పనిచేయాలన్నా, ఫొటోలు, వీడియోలతో పాటు అనేక రకాల సాఫ్ట్వేర్లను స్టోర్ చేసుకోవాలన్నా, ఏకకాలంలో అనేక అప్లికేషన్లను రన్ చేయాలన్నా మీ పీసీలో కనీసం డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఉండాలి. అదే సమయంలో నాలుగు జీబీల ర్యామ్‌తోపాటు 500 జీబీల హార్డ్‌డిస్క్ తప్పనిసరి.
సమాచారం మాటేమిటి?
ఎక్స్పీ సపోర్ట్ సేవలు రద్దవుతున్న నేపథ్యంలో సమాచార తస్కరణకు, విధ్వంసానికి హ్యాకర్లు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాబట్టి మీ పీసీల్లో ఉండే సమాచారం విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఇందుకోసం మొత్తం సమాచారాన్ని నేరుగా ఫ్లాష్ లేదా యూఎస్బీ ఆధారిత ఎక్స్టర్నల్ హార్డ్డ్రైవ్ల్లోకి ఎక్కించుకోవడం ఒక ఆప్షన్. లేదా డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ సర్వీసులపై ఆధారపడాలి. ఈ రకమైన క్లౌడ్ సర్వీసులు కొంత మేరకు ఉచిత స్టోరేజీ సౌకర్యం ఇస్తాయి. ఎక్కువ మోతాదులో సమాచారాన్ని స్టోర్ చేసుకోవాలంటే మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీ నుంచి విండోస్ 7 లేదా 8కు మారుతూంటే ‘ఈజీ ట్రాన్స్ఫర్ టూల్’ ద్వారా సమాచారాన్ని భద్రంగా కొత్త ఓఎస్లోకి మార్చుకోవచ్చు. ఎక్స్పీ కోసం ఈ టూల్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
పాత పీసీతో మరిన్ని చిక్కులు
కొత్త విండోస్ ఓఎస్‌కు మారిపోదామనుకున్నా మీ పీసీ మరీ పాతదైతే ఆ అవకాశముండదు. కచ్చితంగా చెప్పాలంటే 2006కు ముందునాటి పీసీలతో కొన్ని చిక్కులున్నాయి. తగిన ర్యామ్, హార్డ్‌డ్రైవ్, డిస్ప్లే అడాప్టర్లు లభించడం కష్టం. ఒకవేళ ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ పాతకాలం నాటి మదర్బోర్డుతోనూ సమస్యలొస్తాయి. ఈ చిక్కులేవీ వద్దనుకుంటే నేరుగా కొత్త పీసీ కొనడం మేలు. లేదా లినక్స్ వంటి ఓపెన్‌సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లేదా ఆపిల్ మ్యాకింతోష్ ఓఎస్‌లకు మారడం మేలు. లినక్స్ మింట్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు క్రాస్ఓవర్ లేదా ప్లేఆన్ లినక్స్ వంటి అప్లికేషన్లను జత చేసుకుంటే విండోస్ ఓస్‌తో పనిచేసే చాలావరకూ సాఫ్ట్వేర్లను లినక్స్ ఓఎస్‌లోనూ పనిచేసేలా చేసుకోవచ్చు.
2001లో అందుబాటులోకి వచ్చిన విండోస్ ఎక్స్పీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం పీసీల్లో పనిచేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం ఏటీఎంలకు ఈ ఆపరేటింగ్ సిస్టమే ఆధారం.
2014 ఏప్రిల్ 8వ తేదీ నుంచి సెక్యూరిటీ ఆప్‌డేట్స్‌ను నిలిపేయనున్న మైక్రోసాఫ్ట్ వచ్చే ఏడాది వరకూ మాల్వేర్ నుంచి రక్షణ కల్పించేందుకు అంగీకరించింది.
సపోర్ట్ సర్వీసులను మరో ఏడాదిపాటు పొడిగించేందుకు యునెటైడ్ కింగ్డమ్ మైక్రోసాఫ్ట్‌కు చెల్లించనున్న మొత్తం 55 లక్షల పౌండ్లు!