మిడ్ రింగ్స్
సిటీలో అమ్మాయిల వేళ్లు ఇప్పుడు కీబోర్డ్ మీద, స్మార్ట్ఫోన్ల టచ్ స్క్రీన్ల మీద రోజూ గంటల కొద్దీ జామ్ అయి ఉంటున్నాయి. ఫలితంగా ఎక్కువసేపు నలుగురి దృష్టిలో పడుతున్నాయ్. దాంతో ఆ వేళ్ల అందాల్ని సైతం మెరిపించుకోవడానికి అమ్మాయిలు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఆ కోవలోనే మిడ్ ఫింగర్ రింగ్స్‌ను కనిపెట్టారు. ఉంగరపు వేలికి మాత్రమే ఉన్న దర్జాకు గండికొట్టారు.
టిప్స్...
మిడ్ రింగ్స్‌ను.. వేసుకున్న నెయిల్పాలిష్కు తగ్గట్టుగా ఎంచుకోండి
రంగులద్దిన గోళ్లు, మిడ్ రింగ్స్... ఫుల్ స్లీవ్స్‌కు సరిగ్గా నప్పుతాయి
గోల్డెన్, సిల్వర్... తదితర రంగుల్లో అందుబాటులోకి వచ్చిన ఈ మిడ్ఫింగర్ రింగ్స్ ఇప్పుడు అమ్మాయిల వేళ్ల కదలికలకు అనుగుణంగా నాట్యం చేస్తూ తమ స్టేటస్‌ను స్పీడ్‌గా పెంచుకుంటున్నాయి. రియానా, సారా, జెస్సికా పార్కర్, జెన్నిఫర్ లారెన్స్... వంటి పాప్స్టార్స్ ఈ ట్రెండ్‌కు ఆద్యులు కాగా... ఇప్పుడది కాలేజీ అమ్మాయిల ‘చేతి’లోకి వచ్చేసింది. సిటీలో ఉన్న ఫరెవర్ 21, ఆల్డో... వంటి ఫ్యాషన్ యాక్సెసరీస్ షోరూమ్స్‌లో బోలెడన్ని వెరైటీలు లభిస్తున్నాయి. వేలి కొసన ధరించేందుకు వీలుగానూ కొన్ని ఉన్నాయి. ఈ మధ్యవేలి మెరుపుల్ని మన సొంతం చేసుకోవాలంటే రూ. 500 నుంచి రూ.1000 లోపు ఖర్చు చేయాల్సిందే. ఈ కొత్త ట్రెండ్ ప్రకారం...యాక్సెసరీస్ అంటే మెడకు, చెవులకు మాత్రమే అనుకునే రోజుల్ని తిరగరాస్తూ వేలికి కూడా అని మార్చుకోవాలిక.
- సిద్ధాంతి