‘యే షహర్ హమారా.... మేయర్ హమారా’
చార్మినార్: హైదరాబాద్ బల్దియా హైదరాబాదీలదేనని, ‘యే షహర్ హమారా.... మేయర్ హమారా...’ అని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో గురువారం జరిగిన మిలాద్ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో 70 నుంచి 75 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు గత చరిత్ర మరిచి మజ్లిస్ వ్యతిరేక శక్తులతో స్నేహం కోసం ఎంతకైనా దిగజారుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా... అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. తెలుగుదేశం, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మజ్లిస్ పార్టీ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. చాంద్రాయణగుట్టలోని 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు పక్కా గృహాలు నిర్మించాలని, 100 గజాల లోపు భూములకు ఉచితంగా క్రమబద్దీకరించాలని, విద్యుత్, మంచినీరు బకాయిలను ఒకే సారి మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వెనుక వరుసలో అక్బరుద్దీన్
మజ్లిస్ పార్టీ శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మిలాద్ సభలో వేదిక వెనుక వరుసలో తన కుమారుడితో కలిసి కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన దారుస్సలాం ప్రాంగణానికి సమయానికి చేరుకున్నప్పటికీ..కొద్ది సేపు కాలేజీలో కూర్చోని తర్వాత వేదికపైకి వచ్చి వెనుక వరుసలో కూర్చున్నారు.
అసదుద్దీన్ ముందుకు రావాలని అక్బరుద్దీన్‌కు సైగలు చేసినప్పటికి ముందుకు రాలేదు. దీంతో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం సమయంలో ఒక సందర్భంలో అక్బరుద్దీన్‌ను హీరోగా అభివర్ణించారు. ముందుకు వచ్చి ప్రసంగించమంటే వెనుక వరుసలో కూర్చున్నారంటూ చలోక్తి విసిరారు.