రూ. లక్ష కోట్లకుపైగా చెల్లిస్తున్న ఫోక్స్‌వ్యాగన్
మైలేజీ మోసం కేసు...
డెట్రాయిట్: మైలేజీ మోసాల కేసులో వినియోగదారుల, ప్రభుత్వాలతో కేసుల సెటిల్మెంట్, కోసం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి 1,500 కోట్ల డాలర్లకు పైగా(రూ. లక్ష కోట్లకు పైనే) చమురు వదులనున్నది. మైలే జీ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో మోసాలకు పాల్పడినందుకు వినియోగదారులకు, ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ పరిహారం చెల్లించనున్నది. కాగా అమెరికా చరిత్రలో అతి పెద్ద వాహన సంబంధిత క్లాస్-యాక్షన్ సెటిల్మెంట్ ఇదే.
శాన్ఫ్రాన్సిస్కో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ వెల్లడించిన దాని ప్రకారం, 4,75,000 వాహనాలను రిపేర్ చేయడానికి గానీ, లేదా తిరిగి వాటిని వెనక్కి తీసుకోవడానికి గానీ ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ 1,000 కోట్ల డాలర్లు చెల్లించడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా వాహన వయస్సును బట్టి వినియోగదారులకు 5,100- 10,000 డాలర్ల రేంజ్లో పరిహారం చెల్లించనున్నది. మైలేజీ విషయమై మోసం చేసిన కార్లను రిపేర్ చేయడానికి గత కొన్ని నెలలుగా ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆ కార్లను రిపేర్ చేయడం సాధ్యం కాదని, ఆ కార్లను కంపెనీ వినియోగదారుల నుంచి తిరిగి కొనుగోలు చేయక తప్పదని సమాచారం. పర్యావరణానికి హాని కలిగించినందుకు ప్రభుత్వానికి 270 కోట్ల డాలర్ల చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఫోక్స్‌వ్యాగన్‌కు 1,530 కోట్ల డాలర్ల చమురు వదలనున్నది.