శాంతి కోసం... పట్టిన పంతం
దేశంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా తమ మానాన తాము ఉండిపోయే యువతే ఎక్కువ శాతం. ఏ దేశంలోకి తొంగి చూసినా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. సంపన్నదేశాల్లో ఇలాంటి ధోరణి మరీ ఎక్కువ. ఇక జనాలు ఆకలితో అలమటించే దేశాల్లోని యువతకు ఆ ఆకలితో పోరాటానికే సమయం సరిపోతోంది. కానీ వ్యవస్థలో మార్పు కోసం పాటుపడే యువత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వారికి భిన్నంగా ఏటికి ఎదురీదుతూ ఎక్కడో ఒకరు కనిపిస్తారు. తాము చేసే ఉద్యమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇలాంటి వారిలో ఒకరు... ఒమర్ గోల్డ్‌మన్. పదిహేనేళ్లు నిండిన యువత కాలేజీలో చేరడం కన్నా మిలటరీలో చేరడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతుంది. పెన్నులు విసిరేసి గన్నులు పట్టడం మీద ఆసక్తి చూపుతుంది. ఇందుకు భిన్నంగా తమదేశ సంప్రదాయ యువత తీరుకు వ్యతిరేక దిశలో శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది ఒమర్ గోల్డ్‌మన్.
హైస్కూల్ చదువును ముగించుకుని కాలేజీలో చేరే దశ అంటే... అది యువతకు ఒక ఉద్విగ్నపూరిత దశ. జీవితంలో ఒక అద్భుతమైన ఎగ్జైట్మెంట్ను నింపే వయసది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో యువతకు ఇలాంటి అనుభవం చాలా సాధారణం. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉండదు. పదిహేనేళ్లు నిండిన యువత కాలేజీలో చేరడం కన్నా మిలటరీలో చేరడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతుంది. చదువులన్నీ పక్కనపెట్టి, పెన్నులు విసిరేసి గన్నులు పట్టడం మీద ఆసక్తి చూపుతుంది. ఇందుకు భిన్నంగా తమదేశ సంప్రదాయ యువత తీరుకు వ్యతిరేక దిశలో శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది ఒమర్ గోల్డ్‌మన్. ఈమె పోరాడుతోంది అంతర్జాతీయ శాంతి కోసం కాదు... తమ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి.
యుద్ధోన్మాది అనే ముద్ర ఉన్న తన దేశానికి దాన్నుంచి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తోంది. హైస్కూల్ దాటిన విద్యార్థులు సైనికులుగా కాకుండా కాలేజీ స్టూడెంట్స్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. టెల్ అవీవ్ ప్రాంతానికి చెందిన ఒమర్ తండ్రి ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థలో పనిచేసేవారు. దీంతో చిన్నప్పటి నుంచి వీళ్లింట్లో యుద్ధం, సైనికులు, మరణాలు, త్యాగాలు వంటి అంశాల గురించే ఎక్కువ చర్చ జరిగేది. ఇలాంటి పరిస్థితుల్లో తన సోదరుల్లాంటి వాళ్లంతా మిలటరీలో చేరి జీవితాన్ని అశాంతిమయం చేసుకోవడాన్ని... శత్రువులంటూ అమాయకులను చంపి విజయోత్సవాలు చేసుకుంటుండటాన్ని ఒమర్ సహించలేకపోయింది. హైస్కూల్ చదువు పూర్తికాగానే ధైర్యంగా ముందుకొచ్చిన తన స్నేహితులతో కలసి శాంతి పరిరక్షణ బృందాన్ని ఏర్పరిచింది. అప్పటికే ఈ విషయంలో కృషి చేస్తున్న కొంతమంది మాజీ సైనికులతో కలిసి ఒమర్ బృందం శాంతియుత పోరాటం మొదలుపెట్టింది.
పదహారేళ్ల వయసులో ఒమర్ ఈ పోరాటం మొదలుపెట్టింది. ఈమె వ్యూహాత్మకంగా తన వయసు వారిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంది. వారందరిలోనూ ‘శాంతి’ అనే తన భావాన్ని నింపడానికి యత్నిస్తోంది. తను చదివిన స్కూల్లోని సీనియర్లను, జూనియర్లను కలుపుకుని వారి చేత ‘మేము మిలటరీలో చేరం...’ అని ప్రతిజ్ఞ చేయిస్తూ యువతలో యుద్ధోన్మాదాన్ని తనకు చేతనైనంత మేర తగ్గిస్తోంది. యువతలో ఉన్మాదపూరిత, తీవ్రస్థాయి భావోద్వేగపూరిత దేశభక్తిని నిరోధిస్తూ ఒమర్ తన పోరాటాన్ని కొత్త శైలిలో ముందుకు తీసుకెళ్తోంది. ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాన్ని ఆపడానికి, పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులు ఏర్పడటానికి ఐక్యరాజ్యసమితితో సహా ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. వీరెవరి ప్రయత్నాలూ ఫలించడం లేదు. ఒమర్ మాత్రం పరిస్థితిని మూలాల దగ్గర నుంచి మార్చాలని భావిస్తోంది. పశ్చిమాసియాలో శాంతియుత పరిస్థితులను ఏర్పడరచడంలో ఈమె ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిద్దాం.