పాల సరఫరాదారులకు దసరా బోసన్
కొండపాక: విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి పాలు సరఫరాచేస్తున్న రైతులకు దసరా బోనస్ పంపిణీ చేశామని సిర్సనగండ్ల విజయ పాల ఉత్పత్తి దారులు సహకార సంఘం చైర్మన్ గూడెపు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. సిర్సనగండ్ల విజయ పాల ఉత్పత్తిదారులు సహకార సంఘం, పాల సరఫరాదారులు సంఘం అధ్యక్షుడి తీర్మానం మేరకు శనివారం రూ.3.68 లక్షలు పంపిణీ చేశామన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట విజయ పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని కొండపాక మండలం సిర్సనగండ్ల బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ)కు మంచి పేరుందన్నారు. ఈ యూనిట్ నుంచి మర్పడ్గ, కొండపాక, గిరాయిపల్లి, బందారం, అంకిరెడ్డిపల్లి నుంచి రైతులు పాలు సరపరాచేస్తుంటారని తెలిపారు. దీంతోపాటు మరో 15 నాన్సొసైటీలు, డైరీ ఫారాల నుంచి కూడా పాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
సిర్సనగండ్ల పరిధిలోని రైతులకు రూ.99,188, బందారం సొసైటీ పరిధిలోని రైతులకు రూ.18,570, గిరాయిపల్లి సొసైటీ పరిధిలోని రైతులకు రూ.8,549, అంకిరెడ్డిపల్లి పరిధిలోని రైతులకు రూ.24,576, కొండపాక సొసైటీ పరిధిలోని రైతులకు రూ.4,111లు బోనస్ పంపిణీ చేశామని వెల్లడించారు. బోనస్ పంపిణీ చేయగా మిగిలిన రూ.10 లక్షలు సొసైటీ పేరిట నిల్వ ఉన్నాయన్నారు.
రైతులకు దసరా, బతుకమ్మ, మొహర్రం, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో కొండపాక, గిరాయిపల్లి, బందారం, అంకిరెడ్డిపల్లి సొసైటీల చైర్మన్లు కృష్ణమూర్తి, లలిత, పద్మ, రాంచంద్రం, సిబ్బంది క్యాతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.