MILLS COLONY
-
మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు
సాక్షి, వరంగల్ : ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వంచించడమే కాకుండా భూమిపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ రూ.90 లక్షలు వసూలు చేసిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు మూడు రోజుల కిందట కేసు నమోదు చేసినా ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు. దీంతోపాటు పోలీసులపై పలు ఆరోపణలు వస్తుండడంతో సీపీ అలర్ట్ అయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఈ కేసులో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు పెద్దోళ్లకు దగ్గరనే ఆలస్యమా.. మూడు దశాబ్దాలుగా గ్రేటర్ వరంగల్‌లో లిక్కర్ డాన్‌గా ముద్రపడిన కార్పొరేటర్ భర్త తండ్రి తన వ్యాపార విస్తరణకు ఎందరో ముఖ్య నేతలకు దగ్గరయ్యాడు. బిజినెస్ సాఫీగా సాగేందుకు కొందరు పోలీసులతో సన్నిహితంగా ఉండడమే కాదు.. వారికి మగువ, మద్యం చూపి లోబరుచుకొని పనులు చేయించుకునేవాడని వార్తలు సామాజిక మాధ్యమాలతోపాటు టీవీ చానళ్లలో ప్రసారం కావడం పోలీస్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఏకంగా కొందరు ఖాకీలను శ్రీలంక, మలేసియాకు తీసుకెళ్లి విందు వినోదాలు ఇచ్చాడని వచ్చిన వదంతులను తీవ్రంగా పరిగణించిన సీపీ ఈ మేరకు విచారణ చేపట్టి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ మరోవైపు సాధ్యమైనంత తొందరగా ఈ కేసులో నిందితులను పట్టుకోవాలని హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఈ కార్పొరేటర్ భర్త, అతడి తండ్రి ఓ ముఖ్య నేత వ్యాపారంలో భాగస్వామి కావడంతో ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సదరు నేత సీరియస్ అవడంతోనే మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ ఒక రోజు మొత్తం సెలవుపై వెళ్లాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత విధులకు వచ్చారు. దీనిపై ఏసీపీ గిరికుమార్‌ను ఫోన్లో సంప్రదిస్తే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. వీరిని అరెస్టు చేశామని వచ్చిన వార్తలు అబద్ధమన్నారు. కార్పొరేటర్ భర్త పై మోసం, అత్యాచారం, నమ్మకద్రోహం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ఇతడికి సహకరించిన తండ్రిపై కూడా బెదిరింపుల కేసు పెట్టారు. -
దంపతులకు మూడేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నగరంలోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడిన ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి కాలనీకి చెందిన నేరస్తులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి టి.అనిత తీర్పు వెల్లడించారు. డాబాపై నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అర్ధరాత్రి లాక్కెళ్లడం, బతుకమ్మ ఆడి వస్తున్న మహిళలను టార్గెట్ చేసి ద్విచక్ర వాహనంపై వచ్చి విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, శుభకార్యాలకు వెళ్లిన గృహిణులను దారివెంట వెంబడించి ఎవరూ లేని సమయంలో అడ్రసు అడిగే నెపంతో దగ్గరకు వచ్చి విలువైన బంగారు వస్తువులు లాక్కోవడం, కుటుంబ సమేతంగా వెళ్తున్న వారితో కలిసి ఆటోల్లో ప్రయాణం చేసి, ఆటో కుదుపుల సమయంలో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలపైపడి అనుమానం రాకుండా ఆభరణాలు తీసుకోవడంవంటి ఘటనలు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉర్సు, శివనగర్ రైల్వేగేట్ పెరుకవాడ, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, క్రిస్టియన్‌కాలనీ తదితర ప్రాంతాల్లో వరుసగా జరిగాయి. 2013లో రెండు చోరీలు, 2014లో నాలుగు, 2015లో మూడు చైన్‌స్నాచింగ్‌లు జరగగా బాధితుల ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన దంపతులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులు ఈ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేలింది. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా విచారణలో నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు అన్ని కేసుల్లో విధించిన శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కేసు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ డీవీ రామ్మూర్తి వాదించగా సీఐ కె.సత్యనారాయణ, ఎస్సై జి.శ్రీదేవి, బి.రవీందర్ పరిశోధించారు. లైజన్ ఆఫీసర్ నారాయణదాసు విచారణ పర్యవేక్షించగా సాక్షులను కానిస్టేబుల్ జి.జ్ఞానేశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు.