దంపతులకు మూడేళ్ల జైలు
Published Wed, Sep 28 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
వరంగల్ లీగల్ : నగరంలోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడిన ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి కాలనీకి చెందిన నేరస్తులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి టి.అనిత తీర్పు వెల్లడించారు.
డాబాపై నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అర్ధరాత్రి లాక్కెళ్లడం, బతుకమ్మ ఆడి వస్తున్న మహిళలను టార్గెట్ చేసి ద్విచక్ర వాహనంపై వచ్చి విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, శుభకార్యాలకు వెళ్లిన గృహిణులను దారివెంట వెంబడించి ఎవరూ లేని సమయంలో అడ్రసు అడిగే నెపంతో దగ్గరకు వచ్చి విలువైన బంగారు వస్తువులు లాక్కోవడం, కుటుంబ సమేతంగా వెళ్తున్న వారితో కలిసి ఆటోల్లో ప్రయాణం చేసి, ఆటో కుదుపుల సమయంలో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలపైపడి అనుమానం రాకుండా ఆభరణాలు తీసుకోవడంవంటి ఘటనలు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉర్సు, శివనగర్ రైల్వేగేట్ పెరుకవాడ, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, క్రిస్టియన్‌కాలనీ తదితర ప్రాంతాల్లో వరుసగా జరిగాయి.
2013లో రెండు చోరీలు, 2014లో నాలుగు, 2015లో మూడు చైన్‌స్నాచింగ్‌లు జరగగా బాధితుల ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన దంపతులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులు ఈ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేలింది. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా విచారణలో నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు అన్ని కేసుల్లో విధించిన శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కేసు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ డీవీ రామ్మూర్తి వాదించగా సీఐ కె.సత్యనారాయణ, ఎస్సై జి.శ్రీదేవి, బి.రవీందర్ పరిశోధించారు. లైజన్ ఆఫీసర్ నారాయణదాసు విచారణ పర్యవేక్షించగా సాక్షులను కానిస్టేబుల్ జి.జ్ఞానేశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు.
Advertisement
Advertisement