బ్యాడ్ రివ్యూలే మంచి నటుడ్ని చేశాయి
లాస్ ఎంజెల్స్ : తాను నటించిన చిత్రాలపై చెడ్డ సమీక్షలు వచ్చినా తాను పెద్దగా బాధపడనని, వాటిని తనను తాను మలుచుకునే అవకాశాలుగా ఉపయోగించుకుంటానని ప్రముఖ నటుడు మిలో వెంటిమిగ్లియా అన్నారు. బ్యాడ్ రివ్యూలు రాసిన వారిపై కోపం పెంచుకోకపోగా వారిని మెచ్చుకుంటానని, గౌరవిస్తానని తెలిపారు. చెడ్డ రివ్యూలు తనను మరింత పురికొల్పుతాయని, మరింత కష్టపడి పనిచేసే తత్వాన్ని నేర్పుతాయని చెప్పారు.
'ఓ జర్నలిస్టు ఉన్నాడు. ఆయన నా 22 ఏళ్ల కెరీర్లో నిత్యం బ్యాడ్ రివ్యూలే రాశారు. అయినా పర్వాలేదు. నేను వాటిని మెచ్చుకుంటాను. గౌరవిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపేందుకు అవకాశాలు, కారణాలు ఇంకా చాలా ఉంటాయి' అని ఆయన తెలిపారు. ప్రస్తుతం వెంటిమిగ్లియా జాక్ పియర్సన్ అనే పాత్రలో నటించిన 'దిస్ ఈస్ అస్' షో పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. 22 ఏళ్లపాటు తనకు బ్యాడ్ రివ్యూలు ఇచ్చిన వారు ఈ ఒక్క షోకు మాత్రం మంచి విశ్లేషణ రాశారని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని, వారి వల్లే తనను తాను ఒక మంచి నటుడిగా మలుచుకున్నట్లు తెలిపారు. ఈ షో ఇండియాలో స్టార్ వరల్డ్, వరల్డ్ హెచ్డీ ద్వారా కూడా ప్రసారం కానుంది.