రక్షణ సూత్రాలతోనే ప్రమాదాల నివారణ
జీడీకే–11వ గనిని సందర్శించిన రక్షణ తనిఖీ బృందం
గోదావరిఖని : సింగరేణి గనుల్లో రక్షణ సూత్రాలు పాటిస్తేనే ప్రమాదాలు నివారించగలుగుతామని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ గురువయ్య అన్నారు. 49 రక్షణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జీడీకే–11వ గనిని రక్షణ తనిఖీ బృందం సందర్శించింది. ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో రక్షణకు కూడా అంతే ఇవ్వాలని సూచించారు. రక్షణను విస్మరించడం, చెడు అలవాట్లకు బానిస కావడంతో కలిగే అనర్ధాలను తెలిపేలా రిచర్డ్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడి ‘భూతం’ వేషధారణ ఆకట్టుకుంది.
కార్మికులు చేసే పనిలో నిమగ్నం కాకుండా ఇతర వృత్తులను చేపడితే ఏర్పడే ప్రమాదాలపై జనరల్ మజ్దూర్ కార్మికులు మార్క మొగిలి, తీగల లింగయ్య, సర్వే లైన్ మెన్ కె.రామస్వామి ప్రదర్శించి న నాటిక ఆలోచింపచేసింది. ఏజెంట్ సాంబయ్య, మేనేజర్ బి.రవీందర్, సేఫ్టీ ఆఫీసర్ రమేశ్‌బాబు, సంక్షేమాధికారి సారంగపాణి, నాయకులు ఆరెళ్లి పోచం, మోదుల సంపత్, వీరయ్య పాల్గొన్నారు. డివిజన్ –1 పరిధిలోని ఎంవీటీసీలో రక్షణ వారోత్సవాలు నిర్వహించారు. ఎంవీటీసీ టీం కన్వీనర్ ఎంఏసీ రెడ్డి, సభ్యులు సుబ్రహ్మణ్యం, ప్రసన్నకుమార్ గనుల్లో జరిగే ప్రమాదాలు, వాటి నివారణ, రక్షణపై కార్మికులకు వివరించారు.