ఐసీడీఎస్ ‘ఖాళీ’ 697 పోస్టుల భర్తీ ఎప్పుడో..?
ఖమ్మం: తల్లిగర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డ ఆరోగ్యం, మాతాశిశుసంక్షరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు గొప్పలు పోతున్నారు. నెలనెలా కోట్లాది రూపాయల విలువైన పౌష్టికాహారం పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు. కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతోపాటు సీడీపీవోలు, అసిస్టెంట్ సీడీపీవోలు, సూపర్వైజర్ల ఖాళీలు ఐసీడీఎస్ శాఖను అధోగతి పాలుజేస్తున్నాయి. ఉన్నవారు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడం, ఖాళీలు సకాలంలో భర్తీ కాకపోవడంతో జిల్లాలో పలు కేంద్రాల్లో అంగన్వాడీ సేవలు అందటంలేదనే విమర్శలు వస్తున్నాయి.
మాతాశిశు మరణాలకు పౌష్టికాహారలోపం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, బాల్యవివాహాలే కారణమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను బలోపేతం చేసింది. దీనిలో భాగంగా జిల్లాలో 23 ప్రాజెక్టులను ఎంపిక చేసిం ది. వాటి పరిధి లో 4,888 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిద్వారా జిల్లాలో 29,996 మంది గర్భిణులు, 27,635 బాలింతలు, 31,456 మంది ఆరునెలల నుంచి సంవత్సరంలోపు పిల్లలు, 79,039 మంది సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు, 78,921 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. మహిళలకు ఆరోగ్యసూత్రాలు చెప్పడం, పిల్లలను పాఠశాలలకు సన్నద్ధం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. కానీ జిల్లాలో పలు కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు లేకపోవడం, అధికారుల కొరతతో పర్యవేక్షణ కొరవడింది. పౌష్టికారం సక్రమంగా అందడం లేదనే విమర్శలు ఉన్నాయి.
మాతాశిశుసంక్షేమ శాఖలో మొత్తం 697 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 105 అంగన్వాడీ కేంద్రాలకు, 299 మినీ అంగన్వాడీ కేంద్రాలకు కార్యకర్తలు లేకపోవడంతో వాటిని తెరిచేవారే కరువయ్యారు. 190 సెంటర్లలో ఆయాలు లేకపోవడంతో పిల్లలను సెంటర్కు తీసుకురావటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీఆర్పురం, చింతూరు, చర్ల ప్రాజెక్టుల్లో సీడీపీవోలు లేరు. అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, ఖమ్మం రూరల్, వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలో ఒక్కొక్కటి, బూర్గంపాడు ప్రాజెక్టు పరిధిలో మూడు, కల్లూరు ప్రాజెక్టు పరిధిలో నాలు గు, ఇల్లెందు ప్రాజెక్టు పరిధిలో రెండు అసిస్టెం ట్ సీడీపీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలో 52 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంటర్లను పర్యవేక్షణ చేయటం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో 35 సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో కిందిస్థాయిలో సెంటర్లను పర్యవేక్షణ చేయలేక పోతున్నారు. దీనిని సాకుగా తీసుకోని పలు సెంటర్లలో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు గుడ్డు, ఆకుకూరలు, పప్పు, పాలు, బాలామృతం వంటి పోషక విలువలున్న ఆహారం అందడంలేదు.
ముఖ్యంగా భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, ఖమ్మం డివిజన్లోని పలు కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమైక్యలకు మధ్య సమన్వయం లేకపోవడంతో పోషకాహారం అందించడంలేదు. వీరిని సమన్వయం చేయడంలో అధికారుల విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని, అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, పాలు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు.