కనెక్షన్.. కలెక్షన్
మంథని, న్యూస్‌లైన్ : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూ రులో ఎన్పీడీసీఎల్ అధికారులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. డబ్బుల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నిబంధనల మేరకు డిపాజిట్లు కట్టినా.. ముడుపులు ముట్టందే ఫైళ్లు ముట్టుకోవడం లేదు. దానికితోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పైరవీలు తప్పనిసరి. అధికారుల వైఖరితో ఇబ్బం దులకు గురవుతున్నామని మంథని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఒక హెచ్‌పీ కెపాసిటీ కోసం రూ.1225నుంచి రూ.1375 వరకు డీడీ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగా రైతు 3, 5, 7.5 హెచ్‌పీ మోటార్లను వినియోగిస్తుంటాడు. 5హెచ్‌పీ మోటారుకు డీఈ ఎన్పీడీసీఎల్ పేరిట రూ.5125, ఏవో ఈఆర్వో పేరిట రూ.1000 డీడీ తీయాలి. 3హెచ్‌పీకి రూ.3125, రూ.600 డీడీ తీస్తే సరిపోతుంది. 3, 5 హెచ్‌పీ కెపాసిటీ కోసం డీడీలు చెల్లించి కొందరు రైతులు 7.5 మోటార్లను బిగిస్తారు. ఈ విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించే ఎన్పీడీసీఎల్ అధికారులకు రైతు ఎంత కెపాసిటీ కోసం దరఖాస్తు చేసుకున్నా రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. పైగా మంత్రి, శాసనసభ్యుల రికమండేషన్ లెటర్ కూడా తీసుకురావాలని అధికారులు షరతు పెడుతుం డడం వారి ముందు జాగ్రత్త చర్యకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముడుపులు ఏమాత్రం తగ్గినా సర్వీసుల మం జూరులో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు.
ఏప్రిల్ 2013 నుంచి నవంబర్ 30 వరకు మంథని డీఈ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 746 దరఖాస్తులు అందా యి. అందులో 428 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చిన అధికారులు 318 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో రైతు నెలల తరబడి విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా కనికరించడంలేదు. దీంతో అధికారులు కోరిన విధంగా డబ్బులు ముట్టజెబుతున్నారు. లైన్మార్పిడి, కొత్త స్తంభాల ఏర్పాటు, ఇతరత్రా పనులకు సైతం రేటు నిర్ణయించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం జిల్లాస్థాయి అధికారులకు తెలిసినా వారు కూడా తిలాపాపం తలపిరికెడు అన్న చందంగా సద్దుకుపోతున్నారు. విచారణ జరిపి చర్యలు - మాధవరావు, డీఈఈ, ఎన్పీడీసీఎల్ మంథని
మినీ ట్రాన్స్ఫార్మర్లు, ఇతరత్రా పనులకు వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. అలాంటి కేసులేమైనా ఉంటే విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. రైతులు తమకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతరత్రా సామగ్రికి మా సంస్థ నిర్ణయించి ధర ప్రకారమే డీడీ రూపంలో డబ్బు చెల్లించాలి.