పేదల సంక్షేమమే ధ్యేయం
– చంద్రన్న బీమా ప్రారంభోత్సవంలో మంత్రి గంటా
కడప రూరల్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక మేడా కన్వెక్షన్ హాలులో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమాను కేవలం రూ. 15తో కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బీమా కారణంగా రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది, జిల్లాలో ఆరు లక్షల మందికి పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రమాదంలో మరణించినా, పూర్తిగా అంగవైకల్యం కలిగినా రూ. 5 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మరుగుదొడ్లు లేని సమాజానికి విలువ లేదు :
జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ మరుగుదొడ్లు లేని సమాజానికి విలువ లేదని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతోపాటు సర్పంచులు చొరవ చూపాలన్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రన్న బీమాను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా ఎస్సీ కార్పొరేషన్, జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆస్తుల రూపంలో ఆటోలు, మోపెడ్, ఐస్‌బాక్సులు, వలలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, నాయకులు దుర్గాప్రసాద్, సుభాన్‌బాషా, హరిప్రసాద్, మాజీమంత్రులు బ్రహ్మయ్య, రామసుబ్బారెడ్డి, విజయజ్యోతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీలక్షి, జిల్లా మత్స్యశాఖ ఏడీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా తనను కార్యక్రమానికి ఆహ్వనించకుండా అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిప్యూటీ మేయర్ అరీఫుల్లా ఆరోపించారు.