కేరళ సీఎం చాందీపై ఎఫ్ఐఆర్!
నమోదు చేయాలని ఆదేశించిన విజిలెన్స్ కోర్టు
* ముఖ్యమంత్రి చాందీ మా అమ్మకు ఫోన్ చేశారు
* ప్రధాన నిందితురాలు సరిత తాజా ఆరోపణ
తిరువనంతరపురం: సోలార్ స్కామ్‌లో కేరళ సీఎం ఊమెన్ చాందీ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. స్కామ్‌కు సంబంధించి చాందీ, విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా త్రిసూర్‌లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు గురువారం విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది. టీమ్ సోలార్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు చాందీకి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తికి రూ. 1.9 కోట్లు, విద్యుత్ మంత్రికి రూ. 40 లక్షలు లంచంగా ఇచ్చానంటూ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు సరిత ఆరోపణలు చేయడంతో పీడీ జోసెఫ్ అనే వ్యక్తి వేసిన ప్రైవేటు ఫిర్యాదుపై విజిలెన్స్ కోర్టు పై విధంగా స్పందించింది.
కాగా, చాందీని మరింత ఇరుకునపెట్టేలా, గురువారం ఆమె మరో బాంబును పేల్చారు. సోలార్ స్కామ్ వాస్తవాలను వెల్లడించవద్దంటూ 2013లో తన తల్లికి చాందీ ఫోన్ చేశారని, తామిచ్చిన డబ్బులు తిరిగిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ‘కాంగ్రెస్(బీ) నేత గణేశ్ కుమార్ పీఏ ప్రదీప్ మా అమ్మతో పాటు జైలుకు వచ్చి నన్ను కలిశాడు. సీఎం మా అమ్మతో ఫోన్లో మాట్లాడారని, అన్ని కేసులు, ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారని నాకు చెప్పాడు.’ అని వివరించారు. తాను పోలీసు కస్టడీలో ఉండగా స్కామ్ వివరాలతో తాను రాసిన 30 పేజీల లేఖను ఆ తరువాతే 4 పేజీలకు కుదించానన్నారు. స్కామ్‌లో పెద్దవారి పాత్ర ఉందంటూ తాను చేసని ఆరోపణలకు రుజువులున్నాయని చెప్పారు.
రాజీనామా చేయను
తాజా ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఎల్డీఎఫ్ చాందీపై విమర్శల జోరు పెంచింది. సీఎంగా కొనసాగే నైతిక అర్హత చాందీకి లేదని సీపీఎం సీనియర్ నేత అచ్యుతానందన్ పేర్కొన్నారు. ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను చాందీ తిప్పికొట్టారు. ఇది తనకు వ్యతిరేకంగా బార్ యజమానుల లాబీ చేపట్టిన రాజకీయ కుట్ర అని విమర్శించారు. ‘ఆ ఆరోపణలు రుజువైతే సీఎం పదవి నుంచే కాదు.. ప్రజా జీవితం నుంచి వైదొలగుతాను’ అని సవాలు విసిరారు. చాందీ, ఆర్యదన్ మొహమ్మద్‌ల రాజీనామా కోరుతూ సీపీఎం చేపట్టిన నిరసనలు గురువారం హింసాత్మకమయ్యాయి. సచివాలయం ముందు పార్టీ కార్యకర్తలు .. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు.