హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటాం
బాధితుడి కుటుంబాన్ని కలిసిన మంత్రి టి.బి. జయచంద్ర
రూ. 2 లక్షల చెక్ అందజేత
తుమకూరు : నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు బాగాలుగా విడిపోయి తాను మరణిస్తు న్నానని తెలిసీ అవయవాలు దానం చేసిన తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా, కరెగౌడనహళ్ళికి చెందిన హరీష్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టి.బి.జయచంద్ర హామీ ఇచ్చారు. ఈమేరకు బుధవారం ఆయన హరిష్ ఇంటికి వెళ్లి హరీష్ తల్లి గీతమ్మ, అన్న శ్రీధర్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ప్రభుత్వం అందజేసిన రూ. 2 లక్షల చెక్కును హరిష్ తల్లికి అందజేసారు. మంత్రి మాట్లాడుతూ మరణంలోనూ అవయవాలు దానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన హరీష్ వల్ల గ్రామానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆయన జ్ఞాపకాలకు గుర్తుగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకలెక్టర్ మోహన్రాజ్, తాలుకా ఆదికారి ఉమేష్చంద్ర, జడ్పి సీఈఓ రమేష్, టీపీఈఒ శివప్రకాశ్ పాల్గొన్నారు.