ప్రేమ వ్యవహారాలు,నపుంసకత్వం కూడా
రైతుల ఆత్మహత్యలకు కారణాలపై మంత్రి రాధామోహన్
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ఆత్మహత్యలకు కారణాల్లో అప్పులతోపాటు ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వం తదితరాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి మనసు మొద్దుబారిందని ధ్వజమెత్తాయి. 2014లో దేశవ్యాప్తంగా 5,650 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాధామోహన్ రాతపూర్వకంగా తెలిపారు. ఆత్మహత్యకు కారణాల్లో రుణాలు, పంటలు దెబ్బతినడం, కరువు, సామాజిక-ఆర్థిక కారణాలు ఉన్నాయని వివరించారు.
కారణాల్లో ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం, నంపుంసకత్వం, మాదకద్రవ్యాలు వంటివి కూడా ఉన్నాయని జాతీయ నేర రికార్డుల సంస్థ(ఎస్సీఆర్బీ)ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. రైతుల పరిస్థితి తెలుసుకోవడానికి వారి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోదీ తన మంత్రులకు చెప్పాలన్నారు. రాధామోహన్ క్షమాపణ చెప్పాలని నరేశ్ అగర్వాల్(ఎస్పీ)డిమాండ్ చేశారు. సీతారాం ఏచూరి(సీసీఎం), డి.రాజా(సీపీఐ) కూడా విమర్శలు సంధించారు.
మంత్రి సమాధానం ప్రకారం.. దేశంలో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 5,178 మంది పురుషులు, 472 మంది మహిళలు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 2,568 ఆత్మహత్యలు జరిగాయి. రెండోస్థానంలో తెలంగాణ(898), మూడోస్థానంలో ఛత్తీస్గఢ్(826) ఉన్నాయి. మహిళా రైతు ఆత్మహత్యలు తెలంగాణలో అత్యధికంగా(147) జరిగాయి.