తుపాను బాధితులపై మండిపడ్డ మంత్రి
దొడ్డిపట్ల (యలమంచిలి), న్యూస్‌లైన్ :‘దొడ్డిపట్ల ఏటిగట్టు దిగువన సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయి మూడేళ్లు అవుతోంది. ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అడుగుతుంటే ఇదిగో అదుగో అంటున్నారే కానీ స్థలాలివ్వడం లేదు. కూడు పెట్టే ఇసుక ర్యాంపు మూతపడి మూడు నెలలు అవుతోంది. తరచూ వస్తున్న తుపాన్ల వల్ల వేట లేకుండాపోతోంది. హెలెన్ తుపాను దిక్కులేని వాళ్లను చేసింది. ఈ పరిస్థితుల్లో మాకు కూడు ఎలా దొరుకుతుంది బాబూ’ అం టూ దొడ్డిపట్ల మత్స్యకార నాయకుడు శేరు కృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకారులు మం త్రి పితాని సత్యనారాయణ ఎదుట వాపోయారు. మత్స్య కారుల ఎదుర్కొంటున్న ఇతర ఇబ్బందులను మం త్రికి కృష్ణ వివరించబోగా, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీ దగ్గదకొస్తేనే ఈ విషయూలు చెబుతావా. నా దగ్గరకొచ్చి ఎప్పుడైనా చెప్పావా’ అంటూ మంత్రి ఎదురు ప్రశ్నించారు. దీంతో మత్స్యకార నాయకుడు మాట్లాడుతూ ‘మా ఎమ్మెల్యే బంగారు ఉషారాణి దృష్టికి ఇళ్ల స్థలాలు, ఇసుక ర్యాంపు సమస్యను చాలాసార్లు తీసుకెళ్లామ’ని చెప్పబోగా మంత్రి కలుగజేసుకుని ‘జిల్లాలో ఎక్కడా ఇసుక ర్యాంపు లేకపోతే మీ దొడ్డిపట్ల ఇసుక ర్యాంపే పనిచేసింది. అప్పుడు బాగా దండుకున్నారు కదా’ అనడంతో మత్స్యకారులు బిత్తరపోయూరు. అనంతరం డ్వామా పీడీ నరాల రామచంద్రారెడ్డిని పిలిచి ఈ రెండు సమస్యల్ని నోట్ చేసుకోండని చెప్పిన మంత్రి కుర్చీలోంచి లేచి వెళ్లబోయూరు. ఆ సందర్భంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అడ్డాల వెంకట రెడ్డినాయుడు ఎదురెళ్లి ఇప్పటికి మూడుసార్లు వచ్చిన తుపానుల వల్ల తమలపాకు రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తమలపాకు సాగుచేసే కౌలు రైతులకు పరిహారం ఇవ్వడం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. డి ఫారం పట్టా భూములను కౌలుకిస్తే పరిహారం రాదని చెప్పారు. ఈసారి కూడా పరిహారం ఇవ్వకపోతే తమలపాకు రైతులకు పురుగుమందే గతి అని రెడ్డినాయుడు అనడంతో మంత్రి ఆయనపై ఒంటి కాలిపై లేచారు. ‘నా ఎదురుగా పురుగుమందు తాగుతారంటావా’ అంటూ రెడ్డినాయుడును మందలించారు. ఆచంట ఏఎంసీ మాజీ చైర్మన్ చేగొండి సూరిబాబు కలుగజేసుకుని పరిహారం ఇవ్వకపోతే రైతులకు చావే గతి అని చెప్పారని సర్ధిచెప్పగా, మంత్రి వడివడిగా కారెక్కి వెళ్లిపోయారు.