minister girish bapat
-
బడ్జెట్లో నో ఎల్బీటీ
- స్పష్టం చేసిన మంత్రి గిరీష్ బాపట్ - పరిశ్రమలు, వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడి పింప్రి, న్యూస్‌లైన్: వ్యాపారుల ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ సారి బడ్జెట్లో స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) ఉండదని, భవిష్యత్తులో కూడా దీని ప్రస్తావన ఉండదని పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పష్టం చేశారు. పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ ఆధ్వర్యంలో గురువారం ఆటో క్లస్టర్ సభా గృహంలో ‘మేక్ ఇన్ మహారాష్ట్ర-మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుణే నగరంలో పరిశ్రమలకు, వ్యాపారుల సమస్యలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎంఐడీసీలో పరిశ్రమల, వ్యాపార మేళాలు ప్రారంభిస్తామని, అందులో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించవచ్చని అన్నారు. విద్యుత్, అగ్నిమాపక కేంద్రాలు సహా 50 రకాల సమస్యలు గుర్తించామని, వీటిలో కీలక సమస్యల్ని వచ్చే ఏడాదిలోగా పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ గజానన్ బాబర్, పింప్రి-చించ్వడ్ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీజ్, కామర్స్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చరల్ అధ్యక్షుడు, అడ్వొకేట్ అప్పాసో షిందే, ఉపాధ్యక్షుడు ప్రేమ్‌చంద్ మిత్తల్, సభ్యులు సురేశ్ వాడేకర్, వినోద్ బన్సల్, పింప్రి-చించ్వడ్ పరిశ్రమల సంఘటన అధ్యక్షుడు నితిన్ బన్కర్ తదితరులు హాజరయ్యారు. -
మార్చి 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- 22 రోజులపాటు సాగనున్న బడ్జెట్ సమావేశాలు - మార్చి 18న సభ ముందుకు బడ్జెట్ - మిత్రపక్షాలు, ప్రతిపక్షాల సహకారం ఉంటుందా? సాక్షి, ముంబై: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 18న సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీశ్ బాపట్ తెలిపారు. చివరి బడ్జెట్ సమావేశాలను గత ప్రభుత్వం 24 రోజుల పాటు నిర్వహించిందని ఆయన చెప్పారు. శాసన సభ వ్యవహారాల కమిటీ తీవ్ర కసరత్తు తర్వాత తుది మెరుగులు దిద్ది ఈ షెడ్యూల్ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే అంతకన్నా కనీసం ఒక్కరోజైనా ఎక్కువగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ సమయాభావం వల్ల కేవలం 22రోజుల పాటు (మార్చి 31 వరకు) సభా కార్యకలాపాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిచినట్లు వెల్లడించారు. ఫడ్నవీస్ ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు మొదటి సారి కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం పై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలపై పన్నుల రూపంలో వాత పెడతారా అని ఆందోళన చెందుతున్నారు. పాన్సారే హత్యపై ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆగని రైతు ఆత్మహత్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహాయం ఇప్పటికీ అందకపోవడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని యోచిస్తున్నారు. కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలను ఫడ్నవీస్ నెరవేర్చడం లేదని ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. శివసేనకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వకుండా ప్రాధాన్యం లేని శాఖలిచ్చి, ప్రధాన శాఖలన్నీ బీజేపీ దగ్గరే ఉంచుకున్నారని మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన హోంశాఖను ఫడ్నవీస్ దగ్గరే ఉంచుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో నాగపూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వంలో జరిగిన నేరాలు, అవినీతి, అక్రమాలను బీజేపీ నిలదీసింది. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీలు పాన్సారే హత్యను బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా మిత్రపక్షమైన శివసేనతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో సఫలీకృతం కాలేదు. ఎన్నికలకు ముందు ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠావలేకు, శేత్కరి అధ్యక్షుడు రాజుశెట్టికి ఇచ్చిన హామీల ఊసు ఇంతవరకు ఎత్తకపోవడంతో వారు కూడా సమావేశాలకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.