కదంతొక్కిన నిర్వాసితులు
►కొల్లాపూర్‌లో భారీర్యాలీ, మంత్రి జూపల్లి ఇంటి ముట్టడి
►పార్టీలు, ప్రజాసంఘాల నేతల మద్దతు
►శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవాలని డిమాండ్
కొల్లాపూర్ : శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు కదం తొక్కారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితుల పట్ల ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టారు. మంగళవారం కొల్లాపూర్‌లో భారీర్యాలీ నిర్వహించారు. వారి పోరాటానికి పలువురు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు మద్దతు తెలిపారు. న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామని భరోసాఇచ్చారు. అనంతరం స్థానిక మహబూబ్ ఫంక్షన్హాల్లో జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను పైకి రానివ్వకుండా పాలకులు ముంచేస్తున్నారని మండిపడ్డారు.
నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం ద ృష్టికి తీసుకెళ్తానన్నారు. జీఓ 98ను రద్దు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ.. ఉద్యమాలతో మంత్రి అయిన హరీష్‌రావు ఇప్పుడు నిర్వాసితుల గురించి పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాకు చెందిన మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు సూపర్‌న్యూమరీ పోస్టులు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి కోరారు. జీఓ 98, జీఓ 68 అమలులో న్యాయపరమైన సమస్యలు ఉన్నాయన్నారు.
సాంకేతిక కారణాలను సాకుగా చూపి తప్పించుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఉద్యమాల సత్తా ఏమిటో మంత్రి జూపల్లికి తెలుసని, స్పందించకుంటే ఆయనకు పరాభవం తప్పదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. నిర్వాసితుల సమస్యలను అసెంబ్లీలో చర్చించేలా బీజేపీ ఎమ్మెల్యేలకు విన్నవిస్తామన్నారు.
తెలంగాణ వచ్చాక కూడా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలా అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప స్పుల రామకృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు ఫయాజ్, టీజేఏసీ, శ్రీశైలం ని ర్వాసిత నిరుద్యోగ సంఘాల నాయకులు చంద్రారెడ్డి, అనంతరెడ్డి, రా జారాంప్రకాశ్, సుబ్బయ్యయాదవ్, బాబుగౌడ్, కుర్మయ్య పాల్గొన్నారు.