సుజల స్రవంతి.. తీర్చేనా దాహార్తి!
సాక్షి, కరీంనగర్ : జిల్లా ప్రజల దాహార్తి తీరనుంది. ప్రజలందరికీ రక్షితనీటి సరఫరాకు అవసరమైన రూ.930 కోట్ల నిధుల మంజూరుకు మంత్రి శ్రీధర్‌బాబు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన విన్నపానికి రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి కె.జానారెడ్డి సానుకూలంగా స్పందించారు.
విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.3,500 కోట్లతో సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. జిల్లా నుంచి నీటిని తరలిస్తూ జిల్లా గొంతు తడపకపోవడం పట్ల ఎంపీ పొన్నం ప్రభాకర్ పలు వేదికల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 10 నెలల కిందట ముఖ్యమంత్రి కిరణ్ హుస్నాబాద్ రాగా ప్రభాకర్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా అంతటా తాగునీటి సమస్య పరిష్కారమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలను అనుసంధానం చేస్తూ కొత్త పథకాలను చేరుస్తూ ప్రణాళిక తయారీలో అధికారులు జాప్యం చేశారు.
గత నెల 27న జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిర్వహించిన సమీక్షలో ఎంపీ ఈ విషయాన్ని లేవనెత్తి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నాల కూడా అధికారుల తీరును తప్పుబట్టారు. ఆయన ఆదేశాలతో ఐదురోజుల్లో ప్రణాళికను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు శనివారం సమగ్ర అంచనాలను ప్రభుత్వానికి పంపించారు. ఈ నిధులు మంజూరు చేయాలని జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ఆదివారం మంత్రి జానారెడ్డిని కలిసి విన్నవించగా ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.