వెయ్యి పడకలుగా..
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ప్రారంభించారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి సౌకర్యాలపై సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజాను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.2 కోట్లతో ప్రణాళికలు పంపించామని, వాటిని విడుదల చేయాలని ఆయన కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం సీటీ స్కాన్, చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్‌ను పరిశీలించారు.
అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తమకు నెలనెలా సరిగా వేతనాలు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో డీఎంహెచ్‌వో డాక్టర్ అలీంను పిలిపించి ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలున్నాయన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ అన్నింటినీ స్వయంగా పరిశీలిస్తున్నారని, పేదలందరికీ మెరుగైన వైద్యసేవలందించేందుకు ఆస్పత్రికి సత్వరం కావాల్సిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఎమర్జెన్సీ వైద్య సేవలకోసం ఆస్పత్రిలో 30 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ) ఏర్పాటు చేసి సూపర్‌స్పెషాలిటీ సేవలు అందిస్తామని తెలిపారు. ఎంఆర్ఐ, డయగ్నోస్టిక్ సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ భావిస్తోందని అన్నారు.
కరీంనగర్లో త్వరలోనే కళాశాల తప్పకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ తుల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, డాక్టర్లు లక్ష్మణ్, శౌరయ్య, నాయకులు వై.సునీల్‌రావు, చల్లా హరిశంకర్, గుంజపడుగు హరిప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.