భగ్గుమన్న విద్యార్థిలోకం
నారాయణ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా కడప బంద్ విజయవంతం
* పోలీసు నిర్బంధంలోనూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు
* విద్యార్థినుల మృతిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
* పలుచోట్ల మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దగ్ధం
సాక్షి నెట్వర్క్: నారాయణ విద్యా సంస్థలపై ప్రజాగ్రహం మిన్నంటింది. విద్యార్థిలోకం భగ్గుమంది. కడప నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల మరణానికి కారకులైనవారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన కడప బంద్ విజయవంతమైంది.
నగరంలో బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం విధించి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. 15 నెలల్లో ఏకంగా 11 మంది నారాయణ సంస్థల విద్యార్థులు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగమంతా కడపలో తిష్టవేసి అర్థరాత్రి నుంచే అక్రమ అరెస్టులకు పాల్పడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమ్జాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, కడప నగర పార్టీ అధ్యక్షుడు నిత్యానందరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం బంద్ చేయడానికి రోడ్డుపైకి వచ్చిన వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేసినప్పటికీ బంద్ విజయవంతం కాకుండా అడ్డుకోలేకపోయారు.
నగరవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, మౌన ప్రదర్శనలు జరిగాయి. జిల్లాలోని రాజంపేట, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ కరువైందని మండిపడ్డారు. మరోవైపు వామపక్ష పార్టీలు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ వంటి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కళాశాలల బంద్ జరిగింది. పలుచోట్ల ప్రదర్శనలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి నారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
సీమ వ్యాప్తంగా..: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మార్‌పల్లిలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు విశ్వనాథ్లతోపాటు మరో 11మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలులో జిల్లాగేటు వద్ద విద్యార్థులు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రిలో ఆందోళనలు జరిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది.
కార్పొరేట్ కళాశాలలు బంద్
విజయవాడ నగరంలోని కార్పొరేట్ కళాశాలలను విద్యార్థి సంఘాలు మూసివేయించాయి. ఏలూరు రోడ్డులోని నారాయణ కాలేజీ వద్ద ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. బెంజిసర్కిల్ వద్ద మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నేతలు వినోద్, విఠల్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో పీడీఎస్‌యూ నేతలు మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ నుంచి మానవహారంగా ఏర్పడి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఏబీవీపీ నాయకులు కార్పొరేట్ కాలేజీలను మూసివేయించారు. నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కశాశాల ఎదుట పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కాలేజీని విద్యార్థులు ముట్టడించడంతో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ కార్పొరేట్ కళాశాలలను మూసివేయించింది.
శ్రీకాకుళం జిల్లాలోని పలు పట్టణాల్లో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. విశాఖపట్నంలోని పెద వాల్తేరు, సంపత్‌నగర్, వినాయక టెంపుల్ రోడ్డులోనూ విద్యార్థి సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.