పన్నీరు పాట్లు
* అన్నాడీఎంకేలో మరో మలుపు
* సీట్ల బేరం ఆరోపణలపై అరెస్ట్
* నిందితుడు మంత్రి పన్నీర్‌సెల్వం స్నేహితుడు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే టిక్కెట్ల అమ్మకాల బేరం పెట్టిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్నేహితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో అమ్మ నివాసంలో పనిచేసిన వారని తెలుస్తోంది. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన తన నెచ్చెలి శశికళను పార్టీ అధినేత్రి జయలలిత గత కొంతకాలంగా దూరంగా పెట్టారు.
ఈ నేపథ్యంలో శశికళ వర్గంవారు అరెస్ట్ అయ్యారు. పార్టీ వ్యవహారాల పరంగా శశికళ స్థానాన్ని మంత్రి పన్నీర్‌సెల్వం భర్తీ చేశారు. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో ఐదుగురితో కూడిన ఒక క్రమశిక్షణ కమిటీని జయ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆరోపణలు వచ్చిన వారిపై ఈ ఐదుగురు విచారణ జరిపి జయలలితకు నివేదికను సమర్పిస్తారు. విచారణ తీరు, నివేదికను అందజేయడంలో ఈ కమిటీ ఆశ్రీత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పన్నీర్‌సెల్వం, నత్తం విశ్వనాథన్, పళనియప్పన్లను పార్టీ క్రియాశీలక బాధ్యతల నుంచి అధినేత్రి తప్పించారు.
మంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, వైద్యలింగం, తంగమణి, వేలుమణిలతో ఏర్పడిన ఈ కమిటీనే పార్టీలో సీట్ల పంపకాలు, పొత్తులపై చర్చలు జరిపే బాధ్యతలకు నియమించారు. ఈ నేపథ్యంలో మంత్రి పన్నీర్‌సెల్వం స్నేహితుడు అరెస్ట్ కావడం పార్టీలో చర్చనీయాంశమైంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి పన్నీర్ సెల్వం స్నేహితుడు సినీ మహమ్మద్ మరికొందరు కలిసి చెన్నై శివార్లు నీలాంగరైలో ఒక బంగ్లా అద్దెకు తీసుకుని అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తామని కోట్లాది రూపాయల బేరసారాలు సాగిస్తున్నట్లు సీఎంకు సమాచారం అందింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్‌కు జయ నివాసమున్న చెన్నై పోయెస్‌గార్డెన్ నుంచి పిలుపు వచ్చింది. ఎన్నికల కోడ్ కారణంగా కమిషనర్ రాజేంద్రన్, ఇంటెలిజెన్స్ అదనపు కమిషనర్ వరదరాజన్ అద్దె కారులో పోయెస్‌గార్డెన్‌కు వెళ్లగా అక్కడి గదిలోని టెలిఫోన్ ద్వారా జయలలిత ఇద్దరు పోలీస్ అధికారులతో మాట్లాడారు.
కేంద్రనేర పరిశోధక విభాగం సహాయ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం సిద్ధమైంది. ఈ బృందం నీలాంగరైలోని బంగ్లాపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడి నిర్వహించింది. ఆ సమయంలో మంత్రి పన్నీర్ సెల్వం కుడిభుజంగా పేరొందిన సినీ మహమ్మద్, పోయెస్‌గార్డెన్‌లో గతంలో పనిచేసిన ఉద్యోగి రమేష్, శివకుమార్ పట్టుబడ్డారు. విచారణలో సీట్లపై బేరసారాలు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్నారు. మంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ భర్త నటరాజన్ సోదరుడు, రిటైర్డు పోలీసు అధికారి మరికొందరు ఉన్నట్లు సమాచారం.
అయితే పట్టుబడిన ముగ్గురూ తమకేమీ తెలియదని పనులు చేసిపెడితే జీతం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ ముఠాతో సంబంధం ఉందన్న ఆరోపణలపైనే దక్షిణ చెన్నై పార్టీ కార్యదర్శి ఎంఎం బాబు, విజయభాస్కర్‌లపై జయలలిత వేటువేసింది. మరో పదిమంది జిల్లా కార్యదర్శులపై వేటుపడే అవకాశం ఉందని భోగట్టా. నీలాంగరై బంగ్లాలో పట్టుబడిన ముగ్గురిపై అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.
మాకొద్దు ఈ నేత
పల్లవరం ఎమ్మెల్యే (అన్నాడీఎంకే) ధనసింగ్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోనే బహిరంగ ప్రచారం సాగుతోంది. ధనసింగ్‌కు తాజా ఎన్నికల్లో పోటీకి పెట్టరాదంటూ పల్లవరం నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలు అన్నాడీఎంకే అధినేత్రికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. కొత్తగా ఏర్పడిన పల్లవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ధనసింగ్ గెలిచారు. పార్టీ కార్యక్రమాలకు మినహా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. అంతేగాక ఎదిరించిన వారిని అణిచివేయడం, కుమారులకు పెత్తనం అప్పగించడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ధనసింగ్‌కు టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని 30 మంది పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించారు.