రాకెట్ దాడి నుంచి తప్పించుకున్న మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ఆరోగ్యశాఖ మంత్రిపై రాకెట్ దాడి జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆరోగ్య శాఖమంత్రి రెహ్మత్ సలేహ్ బలోచ్ గురువారం ఉదయం ప్రోమ్ నుంచి పంజ్‌గుర్ పట్టణానికి తన కాన్వాయ్‌లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరపటంతో పాటు రాకెట్లను ప్రయోగించారు. రాకెట్లు గురితప్పగా మంత్రి వెంట ఉన్న భద్రతాబలగాలు ఎదురు కాల్పులు జరపటంతో దుండగులు పలాయనం చిత్తగించారు.
ఈ ఘటనకు సంబంధించి బాధ్యులెవరనేదీ తెలియరాలేదు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేపట్టాయి. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం కావాలని స్థానికులు కొంతకాలంగా సాయుధ పోరు సాగిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ అల్‌ఖైదా కూడా బలంగా ఉంది. ఈ రాష్ట్రం అఫ్ఘానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది.