స్వాతి మేడమ్.. ఏమిటీ పని?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్‌కు తప్ప ఏ ఒక్క మంత్రికీ మీడియా ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అపోహ పటాపంచలైంది. ఒకే ఒక్క పనితో యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటో తెలుసా?
"బీ ద బీర్' అనే పేరుగల లగ్జరీ బార్‌ను ప్రారంభించడమే మంత్రి స్వాతి చేసిన పని! అదేంటి? యూపీలో మద్యనిషేధం లేదుగా, మందు షాపు ఓపెన్‌చేస్తే తప్పేముంది? అని సందేహంరావచ్చు. ఏ ఇతర పార్టీనో అధికారంలోఉన్నా, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా అసలీచర్చ ఉండేదేకాదు! బీఫ్‌ను బ్యాన్చేసిన, సన్యాసి ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ఇలా చెయ్యడాన్ని కాషాయదళం కూడా జీర్ణించుకోలేకపోతున్నది.
'బీఫ్‌ను బ్యాన్ చేసి.. బీర్‌ను పొంగిస్తున్నారు..', 'ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు.. మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు..' 'ముసుగు తొలిగిస్తే కనబడే బీజేపీ అసలు ముఖం ఇదే..' 'స్వాతి మేడమ్ ఏమిటీ పని' అంటూ మంత్రి భుజం మీదుగా బీజేపీ, యోగిలపై నెటిజన్లు విమర్శలు సంధింస్తున్నారు. అంతా సాఫీగా జరుగిపోతున్నవేళ స్వాతి సింగ్ చర్యతో మొదలైన వివాదంపై సీఎం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. అసలా కార్యక్రమానికి ఎందుకు వెళ్లాల్సివచ్చిందో స్వాతిని వివరణ కోరినట్లు సమాచారం.
అన్నట్లు ఈ స్వాతి సింగ్ ఎవరోకాదు.. ఆ మధ్య బీఎస్పీ చీఫ్ మాయావతిని అభ్యంతరకంగా దూషించి, బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్సెండ్ అయిన దయాశంకర్ సింగ్ సతీమణే! యోగి కేబినెట్లోని మహిళా మంత్రుల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆమె.. బార్ ఓపెనింగ్‌పై ఏం వివరణ చెబుతారో వేచిచూడాలి.