ప్రచార ఆర్భాటం
- మంత్రులు దేవినేని, పరిటాల హడావుడి
- శిలాఫలకాలకే ప్రారంభోత్సవాలు
- గతంలో చేసిన పనులకు మళ్లీ కొత్తగా రిబ్బన్కట్లు
- విస్తుపోయి చూసిన జనం
కనగానపల్లి : ఎన్నికల్లో అపద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన టీడీపీ నేతలు ..అభివృద్ధి పనులు చేపట్టడంలోనూ అంతా మాయ చేశారు. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా ప్రారంభిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. పనులు నిర్మాణ దశలోనే ఉన్నా..శిలాఫలాలు ప్రారంభించి ఆర్భాటం చేశారు. ఆదివారం కనగానపల్లి మండలంలోని చంద్రాశ్చర్ల గ్రామంలో రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, అధికార యంత్రాంగం చేసిన హంగామానే ఇందుకు నిదర్శనంగా మారింది. ఓ వైపు అభివృద్ధి పనులు మధ్యలోనే ఉన్నా..ఆర్భాటంగా శిలాఫలకాలకు ప్రారంభోత్సవాలు చేసి నవ్వులపాలయ్యారు.
పాతవాటికే ప్రారంభోత్సవాలు
మండలంలోఅభివృద్ధి పనులకు రూ.మూడు కోట్లు పైగా ఖర్చు చేసినట్లు అధికార పార్టీ నేతలు ఢంకా మోగించారు గానీ దాదులూరు, కుర్లపల్లి, చంద్రశ్చర్ల గ్రామాలకు మంజూరైన నాలుగు అంగన్వాడీ భవనాల్లో ఏ ఒక్కటి ఇంకా నిర్మాణం పూర్తికాలేదు. చంద్రాశ్చర్లలో ఏడాది క్రితం వేసిన సిమెంట్ రోడ్లు, ఆరు నెలల క్రితమే మొదలైన వాటర్ప్లాంట్లనే మంత్రులు ఆదివారం కొత్తగా ప్రారంభించటం చూచి స్థానికులు ఆశ్చర్యపోయారు. చంద్రాశ్చర్లలో బోరుబావుల్లో నీరు అడుగంటి పోయి తాగునీరు కూడా దొరక్క స్థానికులు ఇబ్బందులు పడుతుంటే ..ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హంద్రీనీవా నీటివల్ల ఈ ప్రాంతంలోని బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయని, వ్యవసాయ పొలాలలు కళకళలాడుతున్నాయని చెప్పడం విని రైతులు ముక్కున వేలేసుకున్నారు.
ఎంపీ నిమ్మలను నిలదీసిన అధికార పార్టీ నేత
సమావేశం చివరిలో వచ్చిన ఎంపీ నిమ్మల కిష్టప్ప స్థానిక సమస్యలను గురించి మాట్లాడకుండా ఢిల్లీలో జరిగే రాజకీయాలు గురించి ఊదరగొడతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై అనవసరమైన విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే అధికార పార్టీకి చెందిన సహకార సొసైటీ ఇన్చార్జ్ కుర్లపల్లి రాజప్ప మాట్లాడుతూ.. మూడేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ గ్రామానికి ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మంజూరు చేయించలేదని ఎంపీని నిలదీశారు. దీంతో అక్కడున్న టీడీపీ నాయకులు, అధికారులు ఒక్కసారిగా కంగుతుని, సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మంజూరు చేయిస్తామని ఎంపీ చేత చెప్పించారు. ఇక దాదులూరు పంచాయతీలో ఒకే రోజు రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నామని వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి సరైన స్పందన లేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులే అవాక్కయ్యారు. కార్యక్రమంలో జేసీ రమామణి, ఆర్డీఓ బాలనాయక్, ఎంపీపీ పద్మగీత, తహసీల్దార్ సుధామణి, ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, స్థానిక సర్పంచ్ రామసుబ్బయ్య, పలు శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.