గోల్మాల్ ఉత్తదే!
చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారంతోపాటూ కోడిగుడ్డును ప్రభుత్వం అందజేస్తోంది. అయితే కోడిగుడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి ఏడాదికి రూ.50 కోట్ల వరకు ప్రభుత్వానికి టోపీ పెడుతున్నట్లు ఇటీవ ల ఆరోపణలు వెల్లువెత్తాయి.అసెంబ్లీలో సైతం ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి వలర్మతి బదులిచ్చారు. రాష్ట్ర వ్యాప్తం గా ఏడాదికోసారి టెండర్లు పిలిచి కోడిగుడ్డు కొనుగోలు బాధ్యతను అప్పగిస్తున్నామన్నారు. టెండర్ల విధానం వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వచ్చిందన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో గోల్మాల్ జరిగిదంటూ జరిగిన ప్రచా రం ప్రతిపక్షాల కుట్రగా ఆమె అభివర్ణించారు.
జయ ముఖ్యమంత్రిగా రూ.31వేల కోట్ల పధకాలను ప్రకటించగా, వాటిల్లో ఒక్కటైనా పూర్తయిందాఅని డీఎంకే సభాపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. డీఎంకే మైనార్టీ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన ప్రగతికంటే మూడేళ్లలో తమ ప్రభుత్వం సాధించిందే ఎక్కువని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బదులిచ్చారు. డీఎంకే ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వం అని పిలవడంపై ఆ పార్టీ సభ్యులు గందరగోళం సృష్టించారు. తమది మైనార్టీ ప్రభుత్వమైతే ప్రస్తుత ప్రభుత్వం ఏమిటి, ఈ ముఖ్యమంత్రిని ఎలా పిలవాలి అంటూ డీఎంకే వ్యాఖ్యానించడంతో మరింత గందరగోళం నెలకొంది. జయలలితను అన్నాడీఎంకే నేతలు ప్రజల ముఖ్యమంత్రి అని పిలవడంపై పరోక్షంగా డీఎంకే సభ్యులు ఎద్దేవా చేయడంతో అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిస్తున్న జయను ప్రజల ముఖ్యమంత్రి అనడంలో తప్పేమిటని ఇండియా కుడియరసు పార్టీ అధ్యక్షులు, శాసనభ్యులు తమిళరసు డీఎంకే సభ్యులను నిలదీశారు.
శాంతి భద్రతల సమస్యకు దారితీసే స్థాయిలో రాష్ట్రంలో జాతి విద్వేషాలు లేవని సీఎం పన్నీర్‌సెల్వం, పుదియ తమిళగం పార్టీ సభ్యులు డాక్టర్ కృష్ణస్వామిప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూడేళ్లలో తూత్తుకూడి, తిరునెల్వేలీ జిల్లాలో జాతి విద్వేష సంఘటనలు, కేసుల వివరాలను సభకు వివరించారు. తిరునెల్వేలీలో 2013లో 5 హత్యలు, 2014లో 10, తూత్తుకూడిలో 2013లో ఒకటి, 2014లో 3 హత్యలు జరిగాయని వివరించారు. అయితే అవేవీ తీవ్రస్థాయిలో శాంతి భద్రతల సమస్యకు దారితీయలేదని సీఎం అన్నారు. జయపై డీఎంకే సభ్యులు, కరుణపై అన్నాడీఎంకే సభ్యులు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తీవ్రస్థాయికి చేరగా బాహాబాహీకి సిద్ధమయ్యూరు. స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే సభ్యులు ప్రశ్నిం చగా, సభా నిర్వహణ తనకు తెలుసని ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హెచ్చరించారు. అంతేగాక మార్షల్స్ చేత వారిని వెలుపలకు గెంటివేసే ప్రయత్నం చేయడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.