లక్ష ఉద్యోగాలు హుష్‌కాకి!
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై చంద్రబాబు సర్కారు కాకిలెక్కలు
ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబుకు ఓటేస్తే జాబు వస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అన్నారు. ఇలా ఎన్నికల ముందు నిరుద్యోగులను మురిపించారు. అపుడు ఎన్నో కాకమ్మ కథలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఓట్లేయించుకున్న తర్వాత ప్లేటు ఫిరాయించారు. క్రమబద్ధీకరణ మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా రెండేళ్లు గడిపేశారు. ఇపుడు ప్రభుత్వఉద్యోగాల ఖాళీలపై మరో కథ సిద్ధం చేశారు. ఉన్న ఖాళీలను దాచిపెట్టి కొన్ని ఖాళీలను మాత్రమే చూపిస్తున్నారు. నిరుద్యోగులను మరోసారి బురిడీ కొట్టించడానికి లెక్కలు సిద్ధం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తమను మరోసారి మోసం చేయడానికి సిద్ధం కావడంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.. ఇపుడు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై కాకిలెక్కలతో నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒకపక్క దశల వారీగా 20 వేల ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతూ, మరోపక్క సుమారు లక్ష ఉద్యోగ ఖాళీలకు ఎసరు పెడుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆర్థిక శాఖ గణాంకాలు సమర్పించింది. ఇందులో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలు కాగా అందులో 77,737 ఖాళీలున్నట్లు వివరించింది. ఈ ఖాళీల్లో 20 వేల వరకు దశలవారీగా భర్తీచేస్తామని పేర్కొంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 ఉద్యోగ ఖాళీలున్నట్లు ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీకి నివేదించింది.
2014 జూన్ 2 తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లకు పెంచడంతో ఆ గడువు తీరిన వారు ఈ జూన్‌లో దాదాపు 30 వేల మంది రిటైర్ కానున్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం ఖాళీలు 1,72,825 అవుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 77,737 ఖాళీలు మాత్రమే ఉన్నట్లు చెబుతోంది. మరి విభజన తరువాత రాష్ట్రంలో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల (1,72,825)లో మిగతా 95,088 పోస్టులు ఏమైనట్లు? ఎక్కడికి పోయినట్లు?. ఇపుడు ఇదే ప్రశ్న నిరుద్యోగుల్ని వేధిస్తోంది. ఇన్ని వేల ఖాళీలను ప్రభుత్వం కుదించి చూపించడంపై వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో దశలవారీగా 20 వేల పోసుల భర్తీ ప్రకటనపైనా సందేహాలు నెలకొంటున్నాయి. ఎందుకంటే 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్షలు నిర్వహించి నెలలైనా ఇప్పటికి ఒక్కరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నియామకాలు న్యాయవివాదాల్లో ఇరుక్కునేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి భర్తీలు జరక్కుండా ఎత్తుగడ వేస్తోందని, ఇందుకు తార్కాణం 2014 డీఎస్సీనేనని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏమేరకు ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి? నియామకాల ఉత్తర్వుల జారీ వరకు ప్రక్రియ నడుస్తుందా? అనేది ప్రశ్నార్థకమేనని చెబుతున్నారు.
నిరాశలో నిరుద్యోగులు..
పొరుగురాష్ట్రం తెలంగాణలో నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే.. ఏపీలో విభజన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ వెలువడలేదు. నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది. లక్షకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకోసం బాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వ అనుమతులకోసం ఏపీపీఎస్సీ నిరీక్షిస్తోంది. అనుమతులు రాగానే నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. అవసరం మేరకే భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినందున ఖాళీ పోస్టుల్లో ఏ మేరకు భర్తీకి అనుమతి లభిస్తుందనేది సందేహమే. ఖాళీల సంఖ్యను భారీగా కుదించడం ఇపుడు నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పరిమితంగానే భర్తీ..
పరిమితంగానే భర్తీ అని ప్రభుత్వం సంకేతాలిచ్చినందున.. చాలా తక్కువ పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్టు ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ మేరకు ముందుగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపవచ్చని అభిప్రాయపడుతున్నాయి. కమల నాథన్ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే గ్రూప్-1కు సంబంధించి 247 వరకు ఖాళీలున్నాయి. ఇవికాక ఆ తర్వాత ఖాళీ అయిన పోస్టులు మరిన్ని ఉన్నాయి. అయినా అవేవీ భర్తీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. గ్రూప్-2లోనూ వేలాది పోస్టులున్నా 900 పోస్టుల భర్తీకే ప్రభుత్వం అనుమతించే వీలుందని, వైద్యుల పోస్టులు 400, సివిల్ ఇంజనీర్ పోస్టులు 500 వరకు భర్తీకి అనుమతి రావచ్చని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్-1లో 100, గ్రూప్-2లో 900 పోస్టుల వరకు భర్తీకి మాత్రమే అనుమతి రావచ్చంటున్నారు. అదే నిజమైతే లక్షలాది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు కుమ్మరించినట్టే అవుతుంది.
సిలబస్‌లో మార్పులు..
అన్ని పోస్టుల భర్తీకి అనుమతి రావచ్చన్న ఉద్దేశంతో ఇటీవల గ్రూప్-1, గ్రూప్-2 , గ్రూప్-4 సిలబస్‌లో ఏపీపీఎస్సీ మార్పు చేయించింది. ఇప్పటికే మార్పులు చేసిన సిలబస్‌పై నిపుణుల నుంచి అభిప్రాయాలూ సేకరించింది. ఇందులో 1,236 మంది అభిప్రాయాలు తెలిపారు. మార్పులకు వీలుగా సిలబస్ రూపకల్పన కమిటీకి ఆ సూచనలు పంపించారు. కొద్దిరోజుల్లో సిలబస్‌లను ఏపీపీఎస్సీ ఖరా రు చేయనుంది. గ్రూప్-4 సిలబస్‌నూ సిద్ధం చేసినా ముందుగా పెరైండు గ్రూపుల సిలబస్‌లలో మార్పుల్ని ఖరారు చేయనున్నారు.
వర్సిటీ పోస్టుల భర్తీకీ అడ్డంకులు
యూనివర్సిటీల్లో 1,000 వరకు బోధనా సిబ్బంది పోస్టుల్ని భర్తీచేస్తామని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆర్థికశాఖ మాత్రం ఈ పోస్టులన్నిటికీ ఒకేసారి అనుమతి ఇవ్వట్లేదని సమాచారం. వీటిని మూడు దశల్లో భర్తీచేసుకోవాలని ఆర్థిక శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. వర్సిటీల వారీగా గతంలో చేసిన నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తున్న ప్రభుత్వం.. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంటు బోర్డును ఏర్పాటుచేయాలని యోచి స్తోంది. దీనికి యూజీసీ అనుమతించే పరిస్థితి లేకపోవడంతో ఏపీపీఎస్సీ ద్వారా సెట్‌ను నిర్వహించి ఈ పోస్టుల్ని భర్తీచేయాలని నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయి.
అసలు ప్రభుత్వ ఉద్యోగాలెన్ని?
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతనేదానిపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 4,88,485గా చూపారు. అయితే గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య విధాన పత్రంలో మాత్రం 5,18,257 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారు. గ తేడాది లెక్కలతో పోల్చితే ఈ ఏడు 29,772 మంది తగ్గిపోయారు. తాజాగా కేబినెట్ సమావేశంలో ఆ సంఖ్యను 4.83 వేలకు కుదించారు. అదే సమయంలో కమలనాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6,97,621గా ఉండడం గమనించాల్సిన విషయం.