Ministerial Municipal Employees
-
మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ నూతన కార్యవర్గం
విజయవాడ (భవానీపురం) : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎంపిక గురువారం జరిగింది. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ ఎంపిక చేపట్టారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యాచరణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర సభ్యుల ఎన్నిక కార్యక్రమం ఏకగ్రీవంగా జరిగింది. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేత ఎ.విద్యాసాగర్ పాల్గొన్నారు. అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులుగా ఎన్.కష్ణమోహన్రావు (నరసాపురం), ప్రధాన కార్యదర్శిగా డి.ఈశ్వర్ (విజయవాడ కార్పొరేషన్), మహిళా ఉపాధ్యక్షురాలుగా జి.పావని (సీనియర్ అసిస్టెంట్, గుడివాడ), కోశాధికారిగా ఎస్.వెంకటేష్ (సీనియర్ అసిస్టెంట్, మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా ఎన్.నరసింహులు (హిందూపురం), కె.శివాజీ (పిఠాపురం), ఎం మురళి (ఆర్ఓ, తాడేపల్లి), కార్యదర్శులుగా ఈఎస్ ఎర్ర స్వామి (తాడిపర్తి), కేపీ శేఖర్ ఆదిత్య (తణుకు), ఎంవీఎస్‌ఎస్‌కేవీ ప్రసాద్ (విశాఖపట్నం), జాయింట్ సెక్రటరీలుగా ఎస్.అప్పయ్య (విజయనగరం), టి.నాగేశ్వరరావు (విజయవాడ), వి.నాగేశ్వరరావు (నూజివీడు), ఎం.మాల్యాద్రి (చీరాల)లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురిని ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
అసోసియేషన్ ముసుగులో వ్యాపారం
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: నిబంధనలు అమలు చేయాల్సిన ఉద్యోగులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. అసోసియేషన్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన భవనాన్ని దుకాణాల నిర్వహణకు బాడుగలకిచ్చి దండుకుంటున్నారు. ఎక్కడైనా అనుమతి లేకుండా చిన్న నిర్మాణం చేపట్టినా కూల్చివేసే అధికారులే అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టరేట్‌కు సమీపంలోనే ఈ నిర్మాణాలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరులోని బారకాసు సెంటర్లో 1976లో ప్రభుత్వం ఓ భవనం నిర్మించింది. ఈ భవనాన్ని మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు అప్పట్లోనే అప్పగించారు. కొన్నాళ్ల పాటు దీనిని ఉద్యోగులు తమ అసోసియేషన్ కార్యకలాపాలకే వినియోగించారు. అనంతరం వ్యాపార దృక్పథంతో ఆలోచించి భవనంపై 1981లో మరో అంతస్తు నిర్మించారు. ఆ భవనం ఆవరణలోనే ఏడాది క్రితం 15 దుకాణాలతో కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. దీని నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోలేదని సమాచారం. అసోసియేషన్ కార్యాలయంపైనా మరో ఆరు దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించి అడ్వాన్సుల రూపంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు, నెలకు మరో రూ.2 లక్షలు అద్దెల రూపంలో వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం అంతా అసోసియేషన్ సభ్యులే పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం దుకాణాలకు అద్దెకు ఇస్తే, వాటికి సంబంధించిన పన్నును కార్పొరేషన్‌కు చెల్లించాలి. ఈ దుకాణాల విషయంలో ఆ నిబంధనలు అమలుకు నోచుకోలేదని తెలుస్తోంది. ఈ వ్యవ హారం మొత్తాన్ని సభ్యులందరికీ తెలియకుండా కొందరు కార్యవర్గ సభ్యులు నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్జీఓలకు మరో న్యాయం నగరంలోని దర్గామిట్టలో ఎన్జీఓ కార్యాలయం ఉంది. ఈ భవనాన్ని పలు కార్యక్రమాలకు బాడుగలకు ఇస్తుంటారు. అయితే ఈ భవనానికి సంబంధించి పన్ను కట్టలేదంటూ ఇటీవల కార్పొరేషన్ అధికారులు కుళాయి కనెక్షన్ తొలగించారు. ఇక్కడ నిబంధనల ప్రకారం నడుచుకున్న కార్పొరేషన్ అధికారులు తమ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో మరోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం.. జాన్‌శ్యాంసన్, కమిషనర్, నెల్లూరు నగరపాలక సంస్థ నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన అనుమతులు, పన్నుల చెల్లింపు విషయం తెలియదు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.