పచ్చదనంతోనే ఆరోగ్యం
రాష్ట్రాన్ని గ్రీన్‌బెల్ట్‌గా మార్చేందుకు ‘వనం – మనం’
ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
రామవరంలో ముగ్గురు మంత్రుల చేతులు మీదుగా కార్యక్రమం ప్రారంభం
జగ్గంపేట :
పచ్చదనంతోనే ఆరోగ్యం చేకూరుతుందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లాలో ‘వనం – మనం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం మండలంలోని రామవరం గ్రామంలో చినరాజప్ప, ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామవరం పంచాయతీ ప్రాంగణం, మర్రిపాక, ఇర్రిపాక గ్రామాలతోపాటు మార్గం పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం మొక్కలు మాత్రమే ఉన్నాయని గ్రీన్‌బెల్ట్‌కు అవసరమైన 33శాతం వరకు మొక్కలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ ద్వారా మొక్క పెంచుకునేవారికి మూడు సంవత్సరాలకు రూ.750 అందజేస్తామన్నారు. కొండలు, సముద్రతీరంలోను మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, కలెక్టర్ అరుణ్‌కుమార్, జెడ్పీ సీఈవో పద్మ, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీటీసీ జ్యోతుల నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఎస్వీఎస్ వర్మ, పెందుర్తి వెంకటేష్, ఏలేరు చైర్మన్ జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, రవి కిరణ్ వర్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, కందుల కొండయ్యదొర, ఎస్వీఎస్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.