మంత్రిగారి భార్యా మజాకా
చిత్తూరు: అసలే మంత్రిగారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రవేటుగా అనేక కార్యక్రమాలతో నిత్యం మహాబిజీగా ఉంటారు. ఇక అలాంటి వారికి ఆసుపత్రులు, దేవాలయాలు... వాటిని తనిఖీలు నిర్వహించాలంటే సమయం ఉండదు. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఓ మంత్రిగారి భార్య తనిఖీలను తమ భుజానికి ఎత్తుకున్నారు. మంత్రిగారి సొంత నియోజకవర్గంలోని అత్యంత ప్రముఖ దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ ఘటన కాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గురువారం రాహు - కేతు దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా రాహు కేతు మండపం, ప్రసాదాల పోటు, వివిధ విభాగాలను తనిఖీలు నిర్వహించారు. దాంతో ఆలయ అధికారులు, సిబ్బంది హడలిపోయి... ఆమె వెంట పరుగులు తీశారు. అయితే బృందమ్మ తీరుపై స్థానికంగా, భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఏ హోదాలో బృందమ్మ తనిఖీలు నిర్వహించరని భక్తులు ప్రశ్నిస్తున్నారు.