చిన్న పాత్ర అయినా చేస్తా
ప్లీజ్ ఒక్కవేషం ఇవ్వండి.. మొదట్లో ఏ హీరోయిన్ అయినా అనే మాటే ఇది. ఆ తరువాత ఒక్క చిత్రం క్లిక్ అయితే చాలు.. ముందు చేసేపని పారితోషికం పెంచేయడం. ఆ తరువాత తెలియందేముంది. పాత్ర బాగుండాలి. అది కావాలి, ఇది కావాలి అంటూ నిర్మాతలను పిండడం మొదలెడుతారు. ఇది ఏ ఒక్క హీరోయిన్ గురించో ప్రత్యేకంగా చెప్పడం కాదు. హీరోయిన్ల విషయంలో జరిగిన, జరుగుతున్న, జరగనున్న తంతే ఇది. ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే పెద్ద దర్శకుల చిత్రాల్లో చిన్న పాత్ర వచ్చినా చేయడానికైనా రెడీ అంటోంది నటి మధురిమ.
పేరు ఎంత మధురమో ఆమె దంత అందాలు కూడా.. ఇంతకుముందు తమిళంలో ఈ భామ సేందు పోలామా, ఇపికో చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత ఏమైందో ఏమో కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు అవకాశాల కోసం వేట మొదలెట్టింది. రెండు చిత్రాల్లో మెరిసి మాయమైపోయారే అన్న ప్రశ్నకు మధురిమ బదులిస్తూ నిజం చెప్పాలంటే తన తొలి చిత్రం విడుదలకు ముందు పలు అవకాశాలు వచ్చాయని అంది. అయితే లా పూర్తి చేయాలన్న నిర్ణయంతో ఆ అవకాశాలను అంగీకరించలేకపోయానని వివరించింది.
ప్రస్తుతం న్యాయవాదిగా పట్టా పొందాను.. ఇకపై పూర్తిగా నటనపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తనను వెతుక్కుంటూ వచ్చే ప్రతి అవకాశాన్నీ అందుకుంటానని అంది. సినిమాలో తన కల నెరవేరే వరకు నటిస్తూనే ఉంటానని పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నానని తెలిపింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. తన పాత్ర చిన్నదే అయినా పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుల చిత్రాల్లో చిన్న వేషం అయినా నటించడానికి తాను సిద్ధమని మధురిమ అంటోంది. ముందు రంగ ప్రవేశం చేస్తే ఆ తరువాత అల్లుకుపోతాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టుందీ బ్యూటీ.