'సుశీల్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై తెలంగాణ మైనార్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ కమిషన్ చైర్మన్ పోలీసులను కోరారు.
ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి పోలీసులను కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు ఊరుకునేది లేదని ఆమె 'సాక్షి'తో మాట్లాడుతూ తెలిపారు.
గుంటూరులోనూ నిరసనలు!
పత్తిపాడు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొడుకైతే అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అని నినాదాలు చేస్తూ.. మైనార్టీ సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు. ప్రత్తిపాడులోని ఓల్డ్ మద్రాస్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల నుంచి వస్తున్న ఉపాధ్యాయురాలి చేయి పట్టుకొని లాగిన వ్యక్తిపై కేసు పెట్టకుండా అతనికి సాయం చేసిన డ్రైవర్‌పై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.