టాటా సన్స్‌పై మిస్త్రీ పిటీషన్ కొట్టివేత
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో చుక్కెదురైంది. టాటా సన్స్‌లో అవకతవకలు, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై పిటీషన్ వేయడానికి వీలుగా.. అర్హత నిబంధనలు సడలించాలంటూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్సీఎల్టీ బెంచ్ తోసిపుచ్చింది.
కంపెనీల చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. టాటా సన్స్ నుంచి మిస్త్రీ ఉద్వాసనను సవాల్ చేస్తూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సంస్థలు రెండు .. ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. టాటా సన్స్‌లో నిర్వహణ లోపాలున్నాయని, మైనారిటీ షేర్‌హోల్డర్ల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించాయి.
ఇలాంటి పిటీషన్ దాఖలు చేసేందుకు సంబంధించి పిటీషనర్‌కు ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో కనీసం పదో వంతు లేదా మైనారిటీ షేర్హోల్డర్లలో కనీసం పదో వంతు వాటాలు ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ కోరాయి. కానీ, ప్రిఫరెన్స్ క్యాపిటల్ కూడా కలిపితే.. మొత్తం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్‌లో పిటీషనర్ సంస్థలకు కేవలం 2.17% వాటా మాత్రమే ఉంటుందని టాటా సన్స్ వాదించింది. ఈ నేపథ్యంలో అర్హత ప్రమాణాలు కోణంలో పిటీషన్ సాధ్యపడదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు.. తమ వాదనకు బలం చేకూర్చాయని టాటా సన్స్ పేర్కొంది.