రాజమండ్రిని రాజధాని చేయాలి
దానవాయిపేట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : చరిత్రప్రసిద్ధమైన రాజమండ్రి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వెల్పేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్థానిక ఆనంకళాకేంద్రంలో గల గోదావరి కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో జిల్లా చైర్మన్ కేకే సంజీవరావు మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని రాజధాని చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.
ఇక్కడగల వనరులు, పర్యావరణ అనుకూలతలు తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం మూడు గంటలకు మేధావులు, రాజకీయనాయకులు, విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.ఈ సమావే శానికి నగర పౌరులు హాజరై సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నగరానికి వస్తున్న కె.శివరామకృష్ణన్ కమిటీకి ఆర్డీఓ ద్వారా వినతిపత్రం సమర్పిస్తామన్నారు.
జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని జిల్లాలో ఏర్పాటు చేయాలని కాకినాడ సిటీ జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి ముత్తా శశిధర్ అన్నారు. స్థానిక హెలికాన్‌టైమ్స్ హోటల్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ భావిస్తోందన్నారు. అక్కడ ప్రభుత్వ భూములు పూర్తి స్థాయిలో లేవని, భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
అదే మన జిల్లాలో అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కావాల్సిన భూమి రాజానగరం వద్ద అటవీశాఖకు ఉందన్నారు. మన జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఆదివారం జిల్లాకు వస్తున్న శివరామకృష్ణ కమిటీ దృష్టికి అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్లాలన్నారు. జిల్లాలోని మేధావులు మన జిల్లా విశిష్టతను వివరించి రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.