పంచాయతీ మైనర్ ... అవినీతిలో మేజర్
- ఓ గ్రామ కార్యదర్శి లీలలు
- తొట్టి రిక్షా బయట రూ.10 వేలు ... కొనుగోలు రూ 25 వేలు
- రెండు గంటల గ్రామ సభకు రూ 14 వేలు వ్యయమట...!
- మూడేళ్లలో రూ.3 కోట్లు దుర్వినియోగమంటూ ఆరోపణలు
- నాగులాపల్లి పంచాయితీలో నిధుల దుర్వినియోగం
- డీపీఓ విచారణలో లెక్కతేలని రూ.లక్షల నిధులు
పిఠాపురం:
రూ. 10 వేలు కూడా విలువ చేయని తొట్టి రిక్షా రూ. 25 వేలు ... రెండు గంటల గ్రామ సభకు ఖర్చు రూ.14 వేలు ... వాటర్ ట్యాంక్ క్లీనింగ్‌కు రూ. 2,400...ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ లెక్క చూసినా చుక్కలు కనిపించేలా అందినంతా దోచుకున్నారు కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీ అధికారులు. ఒక్కరు తప్ప అందరూ మహిళలే ఉన్న పాలకవర్గంగా ఉన్న ఈ పంచాయతీకి గ్రామ కార్యదర్శిగా ఉన్న వరలక్ష్మి అవినీతికి అంతూపొంతూ లేకుండా పోయిందన్న దానికి బయటపడుతున్న వ్యవహారాలే. క్రయ, వ్యయాలకు సంబంధించిన ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని కార్యదర్శిని ప్రశ్నించినా అదే సమాధానం చెబుతుండడంతో విస్తుపోవడం దర్యాప్తు అధికారుల వంతవుతోంది. రూ 3 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని, తమ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ పాలక వర్గం జిల్లా కలెక్టరుకు జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోగుట్టు బట్టబయలైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ టీవీఎస్‌జీ కుమార్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు.
.
ఏ పుస్తకం లేని వైనం...
పంచాయతీ సర్పంచి సత్యరత్నం, ఉప సర్పంచి సుభాషిణి మరో 12 మంది వార్డు సభ్యులుగా ఉన్న గ్రామ కార్యదర్శి చేసిన అక్రమాలపై డీపీఓ కుమార్ అడిగిన వివరాలేవీ కార్యదర్శి అందజేయలేదు. పంచాయితీకి చెందిన మినిట్స్ బుక్‌తోపాటు ఇతర నిధుల వినియోగంపై రికార్డులను అడగ్గా లేవని ఓసారి, పోలీసులకు ఇచ్చానని మరోసారి, తన దగ్గరే ఉన్నాయని ... కొన్ని పుస్తకాలు కనిపించడం లేదని మరోసారి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
.
పొంతనలేని లెక్కలు...
తొట్టిరిక్షా కొనుగోలుకు రూ.25 వేలు, పాత రిక్షా మరమ్మతులకు రూ.25 వేలకుపైగా, వాటర్ ట్యాంకు క్లీనింగ్‌కు రూ. 2,400, దండోరా వేయించడానికి రూ. వేల ఖర్చు, ఒక టెంటు వేసి రెండు గంటలపాటు నిర్వహించే గ్రామ సభకు రూ.14 వేలు ఖర్చయినట్లు రికార్డులు చూపించడం ... ఆ పుస్తకాల్లో కూడా క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ పేజీల్లో ఇరికిండచం ... మధ్య,మధ్యలో వదిలేయడంతో పలు అనుమానాలకు తావుతీస్తోంది. గ్రామ సభలే పెట్టకుండా ఖర్చులు ఎలా చూపించారని దర్యాప్తు అధికారుల ప్రశ్నకు సమాధానం లేదు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో పలు అవకతవకలు బయటపడగా విచారణ నివేదికలు జిల్లా కలెక్టరుకు అందజేస్తామని డీపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎం.నాగలక్ష్మి, ఎంపీడీఓ పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.