సహారాకు 2 బిలియన్ డాలర్ల రుణం: మిరాచ్ క్యాపిటల్
న్యూఢిల్లీ: దాదాపు 10 నెలలుగా జైల్లో ఉన్న సహారా గ్రూపు అధిపతి సుబ్రతోరాయ్కి బెయిలు లభించేందుకు మార్గం సుగమమవుతోంది. బెయిలు కోసం ఆయన దాదాపు 10వేల కోట్ల పూచీకత్తు సమర్పించాల్సి ఉండగా... ఆయన గ్రూపునకు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12000 కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ అంగీకరించింది. బాగా అవసరమైనపుడు అతి తక్కువ ధరలకు అమ్మేసే ఆస్తుల్ని కొనుగోలు చేయటంలో ఈ డెట్ ఫండ్‌కు మంచి పేరుంది. ఏడాదిలో తిరిగి చెల్లించాల్సిన ఈ రుణానికి 11 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. కాగా ఈ 2 బిలియన్ డాలర్ల రుణంలో బ్యాంక్ ఆఫ్ చైనాకు సహారా గ్రూపు చెల్లించాల్సిన 88.2 కోట్ల డాలర్ల రుణాన్ని టేకోవర్ చేయటం కూడా ఉంది.
అంటే మిరాచ్ క్యాపిటల్ ఈ రుణాన్ని చెల్లించేసి మిగిలిన మొత్తాన్ని సహారా గ్రూపునకు అందజేస్తుంది. ఒకవేళ సహారా సంస్థ రుణాన్ని తిరిగి తీర్చలేని పక్షంలో సహారాకు చెందిన లండన్‌లోని గ్రాస్వెనర్ హౌస్‌ను, న్యూయార్క్‌లోని మరో రెండు ఖరీదైన ఆస్తుల్ని ఈ డెట్‌ఫండ్ తన వశం చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు తీహార్ జైల్లో సుబ్రతో రాయ్‌కి వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాన్ని మంగళవారం నుంచి ప్రారంభించారు. కాగా హర్యానా రాష్ర్టంలోని గుర్గావ్లో 185 ఎకరాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రూ.1,211 కోట్ల చెల్లింపుల్లో భాగంగా సహారా గ్రూప్‌కు రూ.300 కోట్లు చెల్లించినట్లు రియల్టీ సంస్థ ఎం3ఎం తెలిపింది.